రోజురోజుకూ పార్ట్ టైమ్ జాబ్ స్కాంకు బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల గత వారం రోజుల్లోనే 80మందికి పైగా బాధితుల బ్యాంక్ బ్యాలెన్సీ ఖాళీ అయింది. గత వారం రోజులుగా హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్‌ల పరిధిలో నమోదైన సైబర్ మోసాల్లో 50% కంటే ఎక్కువ భాగం పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్‌లకు సంబంధించినవేనని, బాధితుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రధానంగా ఐటీ అధికారులేని పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఒక్కో వ్యక్తి 2 లక్షల నుంచి 35 లక్షల వరకు పోగొట్టుకోవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది.
ఈ రోజుల్లో డబ్బు సంపాదించేందుకు కొంచెం సమయాన్ని కూడా వృథా చేయడం లేదు. అందులో భాగంగానే చాలా మంది ఖాళీ సమయాన్ని వినియోగించుకునేందుకు పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం అన్వేషిస్తు్న్నారు. ఇదే అదనుగా చేసుకున్న స్కామర్స్.. వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పంపిస్తూ వారిని స్కాంలోకి నెడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా అత్యంత ఈజీగా చేసే పనులను మోసగాళ్లు ఎంచుకోనుండడంతో ఉద్యోగానికి ఒప్పించడం వారికి అత్యంత సులువుగా మారుతోంది. అందులో ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, లేదా చూడడం, రివ్యూలు రాయడం, వెబ్ పేజీలకు రేటింగ్ ఇవ్వడం లాంటివే ఉండడం గమనార్హం. అలా ఉద్యోగులను చిన్న పనితో ఆకర్షించి.. తమ ఉచ్చులో పడేలా మోసగాళ్లు భారీ కుట్ర పన్నుతున్నారని పోలీసులు అంటున్నారు.
అలా బాధితులు వారిని నమ్మేలా మొదటిసారి చెల్లింపుల్లో ఎలాంటి డౌట్ రాకుండా చేస్తారు. ఆ తర్వాత వారి ఆసక్తిని గమనించి, వారికి కొన్ని టాస్కులు కూడా ఇస్తుంటారు. ఉదాహరణకు నిర్థిష్ట వ్యవధిలో 10 లేదా కొన్ని వీడియోలు చూడాలని అలా.. ఆ తర్వాత బాధితులను వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లలోని కొన్ని గ్రూపుల్లో చేర్చుతారు. వాటిల్లో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తారు. అలా వారిని మోసం చేస్తూ.. మోసగాళ్లు తమ లక్ష్యం నెరవేరే దాకా కామ్ గా ఉంటారు. మొదటిసారి బాధితులకు అమౌంట్ ను కూడా సెండ్ చేయబడడంతో వారు ఈజీగా మోసగాళ్లను నమ్మేస్తారు. అంతే కాకుండా వారి అకౌంట్ కు సంబంధించిన విషయాలు కూడా లీక్ అవుతాయి. అలా వారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తూ.. చివరి వారి బ్యాంకు బ్యాలెన్స్ నిల్ అయ్యే వరకు తమ మోసాన్ని కంటిన్యూ చేస్తారు.
వాస్తవానికి, వెబ్‌పేజీలు, సోషల్ మీడియా గ్రూప్స్ వారం నుండి 10 రోజుల వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయని, యూట్యూబ్ వీడియోలు (లైక్ చేసిన లేదా చూసిన వీడియోలు) కూడా మోసగాడి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పనికిరాకుండా పోతాయని పోలీసులు అంటున్నారు. బాధితులు ఎప్పుడైతే అమౌంట్ పే చేయడానికి నిరాకరిస్తారో అప్పుడే అసలు కథ మొదలవుతుందంటున్నారు. ఈ తరహా స్కాం రాకెట్ లను నడుపుతున్న కింగ్‌పిన్‌లను పట్టుకునేందుకు ఇంకా వేట కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగా మూడు కమిషనరేట్‌లకు చెందిన బృందాలు ఢిల్లీ , ముంబైల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాల కోసం వెతుకుతున్నారని, చైనా, సింగపూర్‌లో ఉన్న విదేశీయులతో పాటు భారతీయులు ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.