శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ కుమార్తె లిమాన్సా.. తండ్రికి తగ్గ తనయురాలు అనిపిస్తోంది. తండ్రి వలె ఆల్ రౌండర్‌గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు.. శ్రీలంక అండర్-19 జట్టు తరుపున మలేషియాలో జరుగుతున్న U19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ఆడుతోంది.
ఇప్పటివరకూ లిమాన్సా ఆడిన 4 మ్యాచ్‌ల్లో 29 సగటుతో 58 పరుగులు చేసింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఆతిథ్య మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో నాలుగు ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు పడగొట్టింది.
ఏప్రిల్ 9, 2008న జన్మించిన లిమాన్సా.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెగ్ స్పిన్నర్.
తండ్రే రోల్ మోడల్..
తాను క్రికెటర్‌గా రాణించడానికి తండ్రి తిలకరత్నే దిల్షానే స్ఫూర్తి అని లిమాన్సా చెప్పుకొచ్చింది. తన తండ్రి అద్భుతమైన ఆల్‍రౌండర్ అని కొనియాడింది.
'మా కుటుంబానికి క్రికెట్ వంటపట్టింది. తిలకరత్నే దిల్షాన్.. మా నాన్న. ఆయనా నా లాంటి వారే. మంచి ఆల్‌రౌండర్. అందుకు నేను గర్వపడుతున్నాను. మా నాన్న ఆటను చూసే నేను ఈ స్థాయికి చేరాను. ఖాళీ సమయాల్లో ఇప్పటికీ ఆయన వీడియోలు చూస్తుంటాను. అతని బ్యాటింగ్, అతని బౌలింగ్.. నిజంగా మంచి ఆల్‌రౌండర్. నా తండ్రి ఫీల్డింగ్‌లోనూ గొప్పవాడు. అత్యుత్తమ ఫీల్డర్‌లలో ఒకడు. నా ఫేవరెట్ క్రికెటర్.. అని లిమాన్సా పేర్కొంది.