మహబూబాబాద్‌‌‌‌ ఏజెన్సీలో రోడ్లకు లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌

  •     ఫారెస్ట్‌‌‌‌ పర్మిషన్‌‌‌‌ లేకపోవడంతో అర్థాంతరంగా ఆగిన పనులు
  •     ఆఫీసర్లతో మాట్లాడిన మంత్రి సీతక్క
  •     కొనసాగుతున్న గుంజేడు – దుబ్బగూడెం రోడ్డు పనులు

మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాల్లో రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌ అయింది. గతంలో పనులు ప్రారంభమైనా ఫారెస్ట్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ లేకపోవడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. కానీ మంత్రి సీతక్క చొరవ తీసుకొని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లతో మాట్లాడడంతో ప్రస్తుతం పనులు ముందుకు సాగుతున్నాయి.

రూ. 39.82 కోట్లతో 38 కిలోమీటర్ల రోడ్డు

మహబూబాబాద్‌‌‌‌ జిల్లా, ములుగు నియోజకవర్గ పరిధిలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. దీంతో రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్‌‌‌‌వై, రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా 2020లో నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ. 39.82 కోట్లతో గుంజేడు నుంచి దుబ్బగూడం వరకు వయా లడాయిగడ్డ, ముస్మీ, కర్ణగండి, కామారం, పొనుగొండ్ల, రామారం, లింగాల, మామిడిగూడెం వరకు 38.40 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు పనులు ప్రారంభించారు. కానీ ఫారెస్ట్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ లేకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో సీతక్క మంత్రి అయ్యాక ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లతో మాట్లాడి పనులకు క్లియరెన్స్‌‌‌‌ ఇప్పించారు. దీంతో ప్రస్తుతం రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 

ఈ రోడ్లు ఎప్పుడు పూర్తయ్యేనో ?

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని పలు గ్రామాల మధ్య నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌‌‌‌లోనే ఉంటున్నాయి. చెరువుముందు తండా – దొరవారి వేంపల్లి మధ్య బీటీ రోడ్డు కోసం ఏడేళ్ల కింద పీఎంజీఎస్‌‌‌‌వై నుంచి రూ. 3.56 కోట్లు మంజూరు అయ్యాయి. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అలాగే ఐటీడీఏ నిధులతో చేపట్టిన కార్లాయి – ఉట్లమట్టెవాడ, పొగుళ్లపల్లి – మోకాళ్లపల్లి, మొండ్రాయిగూడెం క్రాస్‌‌‌‌ రోడ్డు – ఎంచగూడెం, పొగుళ్లపల్లి పెద్దతండా – నీలంపల్లి, కిష్టాపురం క్రాస్‌‌‌‌ రోడ్డు – బక్కచింతలపల్లి గ్రామాల మధ్య ఫార్మేషన్‌‌‌‌ రోడ్లు వేసినా బీటీ పనులు మాత్రం సాగడం లేదు.

అలాగే కొత్తగూడ మండలంలో గుంజేడు – చిట్యాలగడ్డ రోడ్డుకు రూ.3 కోట్లు, వేలుబెల్లి – చింతగడ్డ తండా రోడ్డుకు రూ.2.40 కోట్లు, గోవిందాపూర్‌‌‌‌ – పొగుళ్లపల్లి రోడ్డుకు రూ.1.40 కోట్లు, కొత్తపల్లి క్రాస్‌‌‌‌ రోడ్డు – ఓటాయి క్రాస్‌‌‌‌ వరకు రూ.6 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు మాత్రమే చేశారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ రోడ్డు పనులు కూడా చేయాలని ప్రజలు కోరుతున్నారు.