- ఇప్పటికే స్థల పరిశీలన చేసిన అధికారులు
- ప్రస్తుత బస్టాండ్ సమీపంలో ఐదెకరాల్లో డిపో నిర్మాణానికి ఏర్పాట్లు
- మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే బస్ డిపో ఏర్పాటుకు నిర్ణయించింది. రెండు నెలల కింద ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పెద్దపల్లిలో డిపో ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి.. స్థల పరిశీలన చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పెద్దపల్లిలో ప్రస్తుత బస్టాండ్ పక్కన ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణం అనువైందిగా అధికారులు గుర్తించారు. ఎంపీడీవో ఆఫీస్ బిల్డింగ్‌లు శిథిలావస్థకు చేరగా వాటిని మరోచోటుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు.
నెరవేరనున్న దశాబ్దాల కల
మూడు దశాబ్దాలుగా బస్ డిపో కోసం పెద్దపల్లి ప్రజలు ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లిలో రైల్వే జంక్షన్ కాగా.. రాత్రి 7 గంటలు దాటితే ట్రైన్ దిగిన గ్రామీణ ప్రజలు తెల్లారేదాకా రైల్వేస్టేషన్‌లోనో.. బస్టాండ్‌లో గానీ ఎదురుచూడాల్సిన పరిస్థితి. పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామాలకు గోదావరిఖని, కరీంనగర్, మంథని, మంచిర్యాల డిపోలకు చెందిన బస్సులు రావాల్సి ఉండగా.. రాత్రి 7 దాటిందంటే గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేవు. దీంతో ప్రజలు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ఆ బస్సులు కూడా రోజుకు ఒకసారి మాత్రమే వచ్చిపోతుండటంతో గ్రామీణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిపో అవసరాన్ని గుర్తించారు...
మూడు దశాబ్దాల తర్వాత ఆర్టీసీ యాజమాన్యం పెద్దపల్లికి బస్ డిపో అవసరాన్ని గుర్తించింది. పెద్దపల్లిలో గతంలోనే బస్‌డిపో ఏర్పాటు కావాల్సి ఉంది. పెద్దపల్లికి గతంలో ఒకసారి డిపో శాంక్షన్ అయింది. పలు కారణాలతో అది నిలిచిపోయిందన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి బస్ డిపో ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. దీంతో డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం పెద్దపల్లిలో బస్ డిపో అవసరాన్ని గుర్తించి వెంటనే ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.