- పదేళ్లుగా పక్కకుపెట్టిన బీఆర్ఎస్ సర్కార్
- తాజాగా అధికారులతో కలిసి సర్వే చేసిన లోకల్ఎమ్మెల్యే
- బైపాస్‌తో తీరనున్న ట్రాఫిక్ సమస్యలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బైపాస్ నిర్మించిందేందుకు లైన్క్లియర్అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు ఈ టర్మ్‌లోనే బైపాస్ పూర్తిచేస్తామని చెబుతుండడంతో పెద్దపల్లి వాసులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి. ఈ ప్రపోజల్ కొన్నేండ్లుగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సర్కార్పక్కనపెట్టింది. ఇటీవల అధికారులతో బైపాస్ ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
గత సర్కార్హయాంలోనే బైపాస్ నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా వివిధ కారణాలతో అవి ముందుకు పోలేదు. ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో అధికారులు సర్వే ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకేంద్రంలో పెరిగిన ట్రాఫిక్
పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారాక టౌన్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. జిల్లా ఏర్పాటు కాకముందు నుంచే పెద్దపల్లి పట్టణానికి బైపాస్ నిర్మించాలని రాజకీయ పార్టీలు, ప్రజలు పలు సందర్భాల్లో నాటి ప్రభుత్వాలకు కోరారు. పట్టణం మధ్య నుంచే రాజీవ్ రహదారి పోతుండడంతో హెవీ వెహికల్స్, ఇతర రాష్ట్రాలకు పోయే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు.
గతంలోనే బైపాస్‌తోపాటు రింగ్‌రోడ్డు, టౌన్లో నుంచే ఫ్లైఓవర్.. ఏదో ఒకటి నిర్మించాలని నిర్ణయించారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి చందపల్లి మీదుగా అప్పన్నపేట వద్ద రాజీవ్ రహదారికి లింక్ అయ్యేలా నిర్మించాలని ప్లాన్ చేశారు. అలాగే పెద్దకల్వల రైట్‌సైడ్ నుంచి హన్మంతునిపేట మీదుగా అప్పన్నపేట ఫ్లైఓవర్‌కు లింక్ అయ్యేలా మరో ప్లాన్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ రెండు ప్లాన్లను పక్కన పెట్టారు.
పెద్దపల్లికి కీలకం
బైపాస్ నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా కేంద్రం అభివృద్ధి జరిగే చాన్స్ ఉంది. తాజా ప్రపోజల్పెద్దపల్లి టౌన్ పెద్ద కల్వల నుంచి అప్పన్నపేట వరకు రెండు వైపులా 500 మీటర్ల పరిధిలోనే విస్తరించి ఉంది. జిల్లా కేంద్రంగా మారినా పట్టణంలోని రాజీవ్ రహదారికి రెండు వైపులా మాత్రమే నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. బైపాస్ నిర్మిస్తే పట్టణం రెండు వైపులా పెరిగే చాన్స్ ఉంది.
దాంతోపాటు పట్టణ శివారులోని భూములకు డిమాండ్ పెరుగుతుంది. బైపాస్ నిర్మాణం చందపల్లి వైపు నుంచి జరిగినట్లయితే నిట్టూరు, నిమ్మనపల్లితోపాటు తుర్కల మద్దికుంట వరకు టౌన్ పెరిగే చాన్స్ ఉంటుంది. ఒకవేళ చీకురాయి, హన్మంతునిపేట, గౌరెడ్డిపేట మీదుగా నిర్మిస్తే అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇప్పటికే హన్మంతునిపేట వైపు కునారం రోడ్డులో ఆర్వోబీ నిర్మాణం జరుగుతుంది. మంథని రోడ్డులో ఇప్పటికే ఫ్లై ఓవర్ ఉంది. కానీ వాహనాల రద్దీకి ఈ ఫ్లైఓవర్ సరిపోవడం లేదు. ఈక్రమంలో మరో ఫ్లైఓవర్ నిర్మించే బదులు ఈ వైపుగా బైపాస్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.