ఘనంగా లింగమంతులస్వామి దిష్టిపూజ

ఘనంగా లింగమంతులస్వామి దిష్టిపూజ
  • కేసారం నుంచి పెద్దగట్టుకు తీసుకొచ్చిన దేవరపెట్టె
  • ముగిసిన జాతర తొలి ఘట్టం

సూర్యాపేట, వెలుగు : దూరజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి దిష్టిపూజ మహోత్సవం ఆదివారం అర్ధరాత్రి యాదవ భక్తులు ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట జిల్లా కేసారం గ్రామానికి శనివారం చేరుకున్న చౌడమ్మ దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేశారు. కేసారం నుంచి దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయంలోకి తీసుకొచ్చారు.

గుట్టపైకి దేవరపెట్టె చేరుకున్న తర్వాత యాదవ సాంప్రదాయ ప్రకారం స్వామివారికి బోనాలు సమర్పించారు. గర్భగుడి ముందు చంద్రపటం వేసి తల్లి, పిల్ల గొర్రెలను స్వామివారికి బలిచ్చారు. అనంతరం బలిని ముట్టుకోవడానికి యాదవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బలి ఇచ్చిన గొర్రెలను వండి భక్తులకు భోజనంగా పెట్టారు.  

డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు..

లింగమంతులస్వామి దిష్టిపూజ సందర్భంగా డీఎస్పీ రవి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసులు, 10 మంది మహిళా సిబ్బంది, హెచ్ జీఎస్18, 4  స్పెషల్ పార్టీలు మొత్తం 150 మందితో భారీ బందోబస్తులో పాల్గొన్నారు.