కోదాడ, వెలుగు: సాగర్ ఎడమ కాల్వకు వారంలో నీటిని విడుదల చేస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగర్ ఆయకట్టు రైతులెవరూ ఆందోళన చెందవద్దని నీళ్లిచ్చి పంటలను కాపాడుతామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు, నీటి విడుదలపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు అర్థంలేనివని మండిపడ్డారు.
వారిని తొమ్మిదేళ్లుగా గుర్తురాని రైతులు, ఎన్నికలు సమీపిస్తుండడంతో గుర్తొస్తున్నారని విమర్శించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ప్రాజెక్టుల పేరిట లక్షల రూపాయలు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆయన హయాంలో కట్టిన మాధవరం, సింగవరం ప్రాజెక్టు శాంతినగర్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మునగాల, మోతే మండలాలకు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లాను సర్వనాశనం చేశారని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్ కుమార్, చందు నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.