ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన

ఇదేందయ్యా ఇది.. రైలును ఆపేసి పట్టాలపై ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్: తమ ప్రాంతానికి బస్సు సర్వీస్ లేకపోతే ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేయడం చూశాం. కానీ ట్రైన్ రోజు ఆలస్యంగా వస్తోందని ఆగ్రహానికి గురైన ప్రయాణికులు.. ఏకంగా రైలును ఆపి నడి పట్టాలపైనే ధర్నాకు దిగారు. ఈ విచిత్ర ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చిత్తాపూర్ సికింద్రాబాద్ మధ్య చిత్తాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీస్ ఉంది. అయితే చిత్తాపూర్ ఎక్స్‎ప్రెస్ ప్రతి రోజు ఆలస్యంగా వస్తోంది.

పది నిమిషాలు కాదు ఇరవై నిమిషాలు కాదు.. ఏకంగా రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు చేసేదేమి లేక.. చిత్తపూర్ ఎక్స్‎ప్రెస్ ఖచ్చితమైన వేళలు పాటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‎లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చిత్తాపూర్ ట్రైన్‎ను నిలిపి పట్టాలపై ఆందోళన చేశారు. ప్రతిరోజు ఉదయం 7:30కి లింగంపల్లి రైల్వే స్టేషన్‎కు చేరుకోవలసిన ట్రైన్ మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా నడుపుతుండడంతో ఉద్యోగాలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 

సకాలంలో ఆఫీసులకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఇక నుంచి చిత్తాపూర్ ఎక్స్‎ప్రెస్ కరెక్ట్ టైమింగ్ పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహించిన ప్రయాణికులను లింగంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్‎కు తరలించారు. అనంతరం ట్రైన్ సమయ పాలన పాటించాలని కోరుతూ ప్రయాణికులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.