- డీఎల్పీవో తీరుపై గ్రామస్తుల నిరసన
లింగంపేట, వెలుగు : లింగంపేట మండలం భవానీపేట బస్తీ దవాఖానా ఎదుట ఇంకుడుగుంత లేకున్నా, ఉన్నట్లు చిత్రీకరించడంతో గ్రామస్తులు స్వచ్ఛసర్వేక్షణ్ అబ్జర్వర్ సునీల్‌గౌడ్, ఎల్లారెడ్డి డీఎల్ పీవో సురేందర్‌తో వాగ్వాదానికి దిగారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా డీఎల్పీవో,అబ్జర్వర్లు బుధవారం గ్రామంలో పర్యటించారు. మరుగుదొడ్లు వాడుతున్నారా? ఇంకుడుగుంతలు ఉపయోగిస్తున్నారా? స్కూల్, అంగన్వాడీ, పల్లెదవాఖానా, గ్రామపంచాయతీ ఆఫీసుల్లో మరుగుదొడ్లు ఉన్నాయా? లేవా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె దవాఖానా వద్ద అబ్జర్వర్ సునీల్‌గౌడ్ ఇంకుడు గుంత లేకపోయినా ఇటుకలు, సిమెంట్ పెచ్చులు పేర్చి ఉన్నట్లు చిత్రీకరించారు.
ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులు డీఎల్పీవో సురేందర్‌ను ప్రశ్నించారు. నన్నడగడానికి మీరెవవరంటూ డీఎల్పీవో నిర్లక్ష్యంగా జవాబివ్వడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తంచేశారు. పారదర్శకంగా విధులు నిర్వహించాల్సిన అధికారులే ఇలా చేయడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎల్పీవో సురేందర్‌ని ప్రశ్నించగా తాను ఎవరితో దురుసుగా ప్రవర్తించలేదని సమాధానమిచ్చారు.