లింగంపేట, వెలుగు: గతంలో జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా అవార్డులు అందుకున్న లింగంపేట కోఆపరేటివ్ సొసైటీ నేడు అవినీతిలో కూరుకుపోయింది. ప్యాక్స్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సీఈఓ సందీప్ కలిసి రూ.73,08,322లను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు జిల్లా సహకార అధికారి(డీసీవో) వసంత నివేదికను సీఈఓ సందీప్‌కు అందజేశారు. పాలకవర్గ సభ్యుల తీర్మానం లేకుండానే సుమారు రూ.80లక్షల సొసైటీ నిధులను చైర్మన్, సీఈఓ కలిసి దుర్వినియోగం చేశారని గత ఏడాది మేలో ఏడుగురు విండో డైరెక్టర్లు రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్ విచారణ అధికారిగా గత ఏడాది జూలై 20న లింగంపేట విండో రికార్డులను సీజ్ చేశారు. ఆదాయ,
వ్యయాల బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకున్నారు. చైర్మన్, సీఈఓ, డైరెక్టర్లను విడివిడిగా విచారించి సుమారు రూ.73లక్షల8వేల322 దుర్వినియోగం జరిగినట్లు నివేదిక ఇచ్చారని డీసీఓ తెలిపారు. సింగిల్‌విండో మహాజనసభ ఏర్పాటు చేసి నిధుల దుర్వినియోగంపై చర్చించి నివేదికను 20లోగా అందించాలని డీసీఓ ఆదేశాలు జారీ చేశారు.