నిజామాబాద్, వెలుగు : కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకున్న కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై కంది సుధాకర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వెంకట నరసింహస్వామి అనే వ్యక్తి కార్ బజార్ పేరుతో నిజామాబాద్‌లో సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ చేస్తుంటాడు. ఇతడు లింగంపేటకు చెందిన కమ్మరి కొండేశ్ అనే వ్యక్తి నుంచి 2022 మార్చిలో స్విఫ్ట్ డిజైర్ కారు కొని నాగారం కాలనీకి చెందిన చిరంజీవి అనే వ్యక్తి అమ్మేశాడు.
ఆ టైంలో కారుపై ఉన్న సుమారు రూ. 3 లక్షల ఫైనాన్స్‌ను చిరంజీవే చెల్లించాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే చిరంజీవి ఫైనాన్స్ కట్టకపోవడంతో బ్యాంక్ సిబ్బంది కొండేశ్ ఇంటికి వెళ్లారు. ఆయన వెంకట నరసింహస్వామిని ఆరా తీయడంతో పాటు లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వెంకట నరసింహస్వామి.. చిరంజీవి వద్ద ఉన్న కారును తీసుకెళ్లి కొండేశ్‌కు అప్పగించాడు. ఇదిలా ఉండగా.. కొండేశ్ ఫిర్యాదుతో లింగంపేట ఎస్సై సుధాకర్ ఈ నెల 23న వెంకట నరసింహస్వామిని స్టేషన్‌కు పిలిపించి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు లాకప్‌లో ఉంచారు.
కారు ఇచ్చేసిన తర్వాత కూడా లాకప్‌లో ఉంచడం ఏంటని వెంకట నరసింహస్వామి ఎస్సైని ప్రశ్నించడంతో రూ.20 వేలు ఇస్తే సీఐ సహకారంతో కేసు లేకుండా చేస్తానని చెప్పి రిలీజ్ చేశాడు. దీంతో రూ. 12,500 ఇచ్చేందుకు ఒప్పుకున్న వెంకట నరసింహస్వామి తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తానని ఎస్సైకి చెప్పడంతో ఆయన బుధవారం కారులో నిజామాబాద్ పట్టణానికి రాగా హనుమాన్ జంక్షన్ వద్ద కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్లారు. కాగా.. నవంబర్ 14న లింగంపేట అప్పటి ఎస్సై అరుణ్‌కుమార్ ఏసీబీకి దొరకడంతో... ఆయన స్థానంలో అదే నెల 28న బాధ్యతలు తీసుకున్న ప్రస్తుత ఎస్సై సుధాకర్ సైతం ఏసీబీకి పట్టుబడ్డాడు.
తోటి ఉద్యోగికి డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు...
ఆదిలాబాద్, వెలుగు : తనతో పాటు పనిచేసిన ఉద్యోగికి డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ వెటర్నరీ డాక్టర్‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ వెటర్నరీ హాస్పిటల్‌లో రాథోడ్ రమేశ్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి జుగ్నాక మాధవరావు ఇటీవల నార్నుర్ మండలానికి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు.
సదరు ఉద్యోగికి రెండు నెలలకు సంబంధించిన డ్యూటీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వెటర్నరీ డాక్టర్ రమేశ్ రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 15 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న మాధవరావు తర్వాత ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో మాధవరావు కుమారుడు గంగాధర్ బుదవారం హాస్పిటల్‌లో డాక్టర్ రమేశ్‌ను కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్, ఇతర ఆఫీసర్లు డాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.