భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో శనివారం నిర్వహించిన మీటింగ్లో ఆమె మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఓటర్ జాబితాలో సవరణలకు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదును ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో 1,095 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటికి మెటీరియల్ సప్లై చేసేందుకు 138 సెక్టార్లు, 149రూట్లుగా విభజించినట్టు పేర్కొన్నారు. 4,380 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 2,190 మంది పోలీసులు డ్యూటీ చేయనున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెహికిల్స్ వెళ్లేందుకు అవసరమైన రూట్లను పక్కాగా రూపొందించాలన్నారు. పెద్ద వెహికిల్స్ వెళ్లలేని రూట్లకు మినీ వెహికిల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసి ప్రక్రియ మొత్తం వీడియో, ఫోటోగ్రఫీ చేయాలన్నారు. సమావేశంలో రిటర్నింగ్ ఆఫీసర్లు రాంబాబు, శిరీష, మంగిలాల్, డీఆర్ఓ రవీంద్రనాధ్, ఎన్నికల పర్యవేక్షకులు ఏఆర్వోలు పాల్గొన్నారు.