బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర: జాజుల శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు:   బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని సరూర్ నగర్ మైదానంలో జరగనున్న బీసీల సింహగర్జన సన్నాహక సమావేశం ఆదివారం నల్గొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్‌ గెస్టుగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని పార్టీలు 60 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

 బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే పార్టీలకు మాత్రమే బీసీల మద్దతు ఉంటుందని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ జండా మోసిన వారికి కాకుండా ఐదు శాతం ఉన్న రెడ్డిలకు 40 టికెట్లు, అర శాతం ఉన్న వెలమలకు 12 సీట్లు కేటాయించడం దారుణమన్నారు. 60 శాతం ఉన్న 136 బీసీ కులాలకు కేవలం 23 సీట్లు మాత్రమే ఇవ్వడం చూస్తుంటే  కేసీఆర్‌‌ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుందన్నారు. 

రాష్ట్రంలో 80 లక్షల మంది బీసీ మహిళలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.   2018లో బీసీలకు 26 సీట్లు ఇచ్చిన  కేసీఆర్ ఇప్పుడు 23 కు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 10న నిర్వహించనున్న బీసీల సింహగర్జన సభను సక్సెస్‌ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు చక్రహరి రామరాజు, వైద్యుల సత్యనారాయణ, కట్టెకోలు దీపేందర్, శంకర్ ముదిరాజ్, ఆరూరి వెంకటేశ్వర్లు, తన్నీరు రాంప్రభు, వెలిజాల వెంకటేశ్వర్లు, జాజుల లింగం తదితరులు ఉన్నారు.