Miami Open: అభిమానులకు డబుల్ కిక్.. ఒకే చోట ఇద్దరు ఆల్‌టైం గ్రేటెస్ట్ ప్లేయర్స్

Miami Open: అభిమానులకు డబుల్ కిక్.. ఒకే చోట ఇద్దరు ఆల్‌టైం గ్రేటెస్ట్ ప్లేయర్స్

టెన్నిస్ లో ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ తో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 9 మాస్టర్స్ టైటిల్స్ గెలవడంతో పాటు ఏటీపీ వరల్డ్ టూర్.. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ జొకోవిచ్ సొంతం. ఒకరకంగా చెప్పాలంటే జొకోవిచ్ టెన్నిస్ లో అన్ని టైటిల్స్ గెలిచాడు. మరోవైపు ప్రస్తుత ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్లలో ఒకడైన లియోనల్ మెస్సీ అంటే తెలియని వారు ఉండరేమో. ప్రపంచంలో మెస్సీ క్రేజ్ నెక్స్ట్ లెవల్. జొకోవిచ్, మెస్సీలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

Also Read :- డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ అదిరిపోయే స్టెప్పులు

వీరిద్దరిలో ఒక్కరిని చూసిన ఫ్యాన్స్ కు పిచ్చ్ కిక్. అలాంటిది వీరిద్దరూ ఒకే చోట కలిసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. శుక్రవారం (మార్చి 28) ఫ్లోరిడాలో జరిగిన మయామి మాస్టర్స్ ఓపెన్‌లో జొకోవిచ్ మ్యాచ్ చూసేందుకు మెస్సీ వచ్చాడు. దిమిత్రోవ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఈ ఫుట్ బాల్ దిగ్గజం తన భార్య పిల్లలతో మ్యాచ్ చూడడం విశేషం. మ్యాచ్ తర్వాత మెస్సీ గురించి జొకోవిచ్ మాట్లాడాడు. అతను తన మ్యాచ్ చూడడం కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఆన్-కోర్ట్ ఇంటర్వ్యూలో జొకోవిచ్ మెస్సీని "కింగ్ లియో" అని పిలిచాడు.

తన మ్యాచ్ చూడడానికి రావడం చాలా పెద్ద గౌరవమని.. అతను కేవలం చాలా గొప్ప ప్లేయర్ మాత్రమే కాదు.. గొప్ప అథ్లెట్ అని జొకోవిచ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత జొకోవిచ్, మెస్సీ ఇద్దరు కలుసుకొని గిఫ్ట్ లను షేర్ చేసుకున్నారు. మెస్సీ చూస్తుండగానే జొకోవిచ్ మ్యాచ్ గెలిచాడు. మియామి ఓపెన్ సెమీ ఫైనల్స్ లో దిమిత్రోవ్ పై వరుస సెట్లలో నెగ్గాడు. ఏకపక్షంగా సాగిన  ఈ మ్యాచ్ లో   6-2, 6-3 తేడాతో ఓడించి మయామి ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన మరో సెమీఫైనల్లో 7-6 (7-4), 4-6, 7-6 (7-4) తేడాతో ఫ్రిట్జ్ పై మెన్సిక్ గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాడు.