పట్టాలపైకి సింహాలు.. రైళ్లకు ఎమర్జెన్సీ బ్రేక్​

 పట్టాలపైకి సింహాలు.. రైళ్లకు ఎమర్జెన్సీ బ్రేక్​

భావ్‌‌నగర్‌‌‌‌: లోకోపైలెట్ల సమయస్ఫూర్తితో ఎనిమిది సింహాలు ప్రాణాలతో బయటపడ్డాయి. గత రెండ్రోజులుగా గుజరాత్‌‌లోని భావ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో గూడ్స్‌‌, ప్యాసింజర్‌‌‌‌ లోకోపైలెట్లు ఎమర్జెన్సీ బ్రేకులు వేసి.. పట్టాలపై తిరుగుతున్న ఎనిమిది సింహాల ప్రాణాలను కాపాడారని ఆదివారం సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భావ్‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌లోని లోకో పైలట్ల అప్రమత్తత, అటవీ శాఖ ట్రాకర్ల సహకారంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 104 సింహాలను రక్షించినట్లు భావ్‌‌నగర్‌‌‌‌ సీనియర్‌‌‌‌ డివిజనల్‌‌ కమర్షియల్‌‌ మేనేజర్‌‌‌‌ మషూక్‌‌ అహ్మద్‌‌ వెల్లడించారు.

లోకోపైలట్‌‌ ధవల్‌‌ భాయ్‌‌ గురువారం హపా నుంచి పిపావావ్‌‌ పోర్ట్‌‌కు గూడ్స్‌‌ రైలును నడుపుతూ, రాజులా నగరం సమీపంలో ఐదు సింహాలు ట్రాక్‌‌ను దాటడాన్ని గమనించాడు. దీంతో లోకో పైలట్‌‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపేశాడు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్‌‌ గార్డు సంఘటనా స్థలానికి చేరుకొని, సింహాలకు ఏమీ కాలేదని వెల్లడించారు. 

అదేవిధంగా, శుక్రవారం ప్యాసింజర్‌‌‌‌ రైలు నడుపుతున్న మరో లోకో పైలట్‌‌ సునీల్‌‌ పండిట్‌‌.. చలాలాధారి సెక్షన్‌‌లో రెండు పిల్లలతో కలిసి ఓ సింహం ట్రాక్‌‌ను దాటడం గమనించి, రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. ఫారెస్ట్‌‌ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోగా, సింహాలు ట్రాక్‌‌ దాటుతూ వెళ్తుండటాన్ని గమనించారు. ట్రాక్‌‌ దాటాక రైలును పంపించి వేశారు. కాగా, గతంలో ఉత్తర గుజరాత్‌‌లోని పిపావావ్‌‌ పోర్టును కలిపే రైల్వే లైన్‌‌లో రైలు ఢీకొని కొన్ని సింహాలు చనిపోయాయి. మరికొన్ని గాయపడ్డాయి.