జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం

జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం

జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మందుబాబులు పాఠశాల పరిసరాలను భ్రష్ఠు పట్టించారు. పాఠశాల పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు కనిపిస్తున్నాయంటే జగిత్యాల సీఎస్ఐ బాలికల పాఠశాలలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

పాఠశాల ఆవరణలోని కండోమ్ ప్యాకెట్లను, మద్యం బాటిళ్లను ఉపాధ్యాయులు విద్యార్థినులతో శుభ్రం చేయించడంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటెండర్ లేడని, విద్యార్థినులతో కండోమ్ ప్యాకెట్లను శుభ్రం చేయిస్తున్న  దృశ్యాలు మీడియా కెమెరాల కంటపడ్డాయి. ఇదేంటని ఉపాధ్యాయులను అడగ్గా.. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఉపాధ్యాయుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ | నవ్య లో ఘనంగా ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ డే

అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి పరిష్కారం చూపాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో వాడిపడేసిన కండోమ్స్, తాగి పడేసిన మద్యం సీసాలను ఎత్తించడం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడ్డాయి. జగిత్యాల పట్టణ పోలీసులు ఈ ఉదంతంపై దృష్టి సారించి, పాఠశాల ఆవరణను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.