ఇలా ఉన్నారేంట్రా: పోలీసులు ధ్వంసం చేస్తున్న లిక్కర్ ఎత్తుకెళ్లిన మందు ప్రియులు

ఇలా ఉన్నారేంట్రా: పోలీసులు ధ్వంసం చేస్తున్న లిక్కర్ ఎత్తుకెళ్లిన మందు ప్రియులు

కళ్లు ముందే వందల కొద్ది మందు సీసాలు.. అందులో కొన్ని తమకు నచ్చిన బ్రాండ్‎లు. ఇలాంటి దృశ్యాన్ని చూశాక ఇక మందు బాబులు ఆగుతారా.. అస్సలే ఆగరు. అందినకాడికి కొందరు.. నచ్చిన బ్రాండ్‎లు తీసుకొని  ఇంకొందరు జంప్ అయ్యారు. ఓ పక్కా పోలీసులు వద్దని వారిస్తున్నా.. మందు కంటే మాకు ఏది ఎక్కువ కాదని.. పోలీసులు మాటలను సైతం బేఖాతరు చేస్తూ మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు కొందరు మద్యం ప్రియులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‎లో జరిగింది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయగా.. ఘటన స్థలం వద్దకు వచ్చిన కొందరు మద్యం ప్రియులు లిక్కర్ బాటిళ్లతో ఉడాయించారు.

 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్‎లో ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానిక యువకులు, మందు బాబులు డంపింగ్ యార్డ్‎ వద్దకు వచ్చారు. కళ్ల ముందే నిండుగా ఉన్న ఫుల్ బాటిళ్లు కనిపించడంతో ఆగలేకపోయారు. వెంటనే తమకు నచ్చిన బ్రాండ్లను కొందరు, అందినవాటిని తీసుకొని మరికొందరు అక్కడి నుండి పరారయ్యారు.

Also Read:-మరో యూట్యూబర్‎కు వార్నింగ్ ఇచ్చిన.. యూట్యూబర్ అరెస్ట్

 ఓ వైపు పోలీసులు వద్దని వారిస్తున్నా.. మందు విషయంలో తగ్గదేలే అన్న రీతిలో వ్యవహరించారు. చేతిలో మందు సీసాలు పట్టుకుని పరుగులు తీశారు. ఇందులో కొందరిని పోలీసులు అడ్డుకోవడంతో వారు చేసేదేమి లేక మందు బాటిళ్లను అక్కడేపెట్టి నిరాశగా వెనుదిరిగారు. ఏకంగా పోలీసులు ముందే లిక్కర్ బాటిళ్లు కొట్టేసిన మద్యం రాయుళ్లకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియో‎పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ‘‘నీ అవ్వా.. మందు విషయంలో తగ్గదేదే’’ అని కొందరు.. ‘మందు ముందుంటే పోలీసులైనా డోంట్ కేర్’ అంటూ ఇంకొందరు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.