నచ్చిన బ్రాండ్ కోసం మందు వినియోగదారుల ధర్నా

నకిరేకల్ (కట్టంగూరు), వెలుగు : వైన్ షాపుల్లో మా బ్రాండ్లు దొర్కుతలేవ్ అంటూ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల విలేజ్​లో లిక్కర్​ వినియోగదారులు బుధవారం ధర్నాకు దిగారు. బెల్టు షాపులు మూయించి.. ఎమ్మార్పీకే మందు అమ్మాలంటూ గ్రామంలోని శివ సాయి వెంకటేశ్వర వైన్స్ ముందు నిరసన చేపట్టారు. కేఎఫ్​ లైట్ బీరు, ఓసీ, ఐబీ, రాయల్​స్టాగ్ బ్రాండ్లు వైన్స్ దుకాణాల్లో అమ్మడం లేదని మండిపడ్డారు. బెల్టు షాపుల్లోనే ఇవి దొరుకుతున్నాయని, ఎమ్మార్పీ మీద 30 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని రకాల బ్రాండ్లు వైన్స్​ షాపుల్లోనే అమ్మాలని డిమాండ్​ చేశారు. ఓనర్లంతా సిండికేట్​గా మారడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే సిండికేట్ విధానాన్ని ఎత్తేయాలన్నారు. బెల్టు షాపులకు కూడా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. బెల్టు షాపులు మూసివేయించాలని డిమాండ్​ చేశారు. రాత్రి 10 గంటల దాకా తెరిచి ఉంచాల్సిన వైన్స్​ షాపులు.. 8 గంటలకే మూసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ లేని మద్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. వైన్​షాప్​ తెరవకుండా లిక్కర్​ వినియోగదారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కట్టంగూర్ ఎస్​ఐ విజయ్​కుమార్​ ధర్నా చేసిన వారిని పోలీస్​ స్టేషన్​కు తరలించి.. బైండోవర్​ కేసు నమోదు చేశారు.