- మద్యం షాపు లైసెన్స్ దారులకు కొత్త తలనొప్పి
- 2017 సర్క్యులర్ ను అమల్లోకి తెచ్చిన అధికారులు
- వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు
- తమకు సంబంధం లేదంటున్న మద్యం వ్యాపారులు
- స్టాక్ తరలింపు వాహనాలను అడ్డుకుంటున్న సీటీవోలు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులు ఇచ్చిన కొత్త సర్క్యులర్ మద్యం షాపుల లైసెన్స్ దారులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. 2017లో తీసుకువచ్చిన సర్క్యులర్ ను ఈనెల నుంచి అమలు చేస్తుండడం మద్యం వ్యాపారుల ఆందోళనకు కారణమైంది. మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు స్టాక్ తీసుకెళ్లాలంటే ఇ–వే బిల్లు ఉండాలని, వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు.
అలా రిజిస్ట్రేషన్ లేకుండా మద్యం స్టాక్ తరలిస్తున్న వాహనాలను అడ్డుకొని సీజ్ చేస్తుండడం ఇప్పుడు అధికారులు, వ్యాపారుల మధ్య చిచ్చు పెడుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు చర్చల ద్వారా మొదటి వారం రోజులు వాహనాలను సీజ్ చేయకుండా అడ్డుకున్నా.. ఇప్పుడు వాళ్లు కూడా వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెబుతుండడంతో మద్యం వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు.
వైరాలో లిక్కర్ డిపో ముందు ధర్నా
రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చిన విధానాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుండడంతో ఇక్కడ నిరసనలు ప్రారంభమయ్యాయి. శనివారం వైరాలోని లిక్కర్ డిపో ముందు మద్యం వ్యాపారులు ధర్నాకు దిగారు. రెండేళ్ల కాలపరిమితితో మాత్రమే లైసెన్స్ తీసుకొని వ్యాపారులు చేసుకునే తమకు వ్యాట్ వర్తించదని వ్యాపారులు చెబుతున్నారు. మద్యం తయారీ కంపెనీల డిస్టిలరీల నుంచి ఐఎంఎల్ డిపోల ద్వారా మద్యం లైసెన్స్ దారులకు మద్యం స్టాక్ చేరుతుంది. దశలవారీగా జరిగే ఈ ప్రక్రియలో డిస్టిలరీల నుంచి ప్రభుత్వానికి వ్యాట్ చెల్లిస్తారని
ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఏర్పాటైన దగ్గర నుంచి ఇదే విధంగా జరుగుతోందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. 2017లో అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ తీసుకువచ్చిన కొత్త విధానం మీద అప్పటి ఎక్సైజ్ అధికారులు చర్చలు జరిపారు. రెండేళ్ల పాటు లైసెన్స్ తీసుకునే వ్యాపారులు వ్యాట్ పరిధిలోకి రారని తేల్చారు. పర్మినెంట్ వ్యాపారులకే వ్యాట్ వర్తిస్తుందని చెప్పి, సర్క్యులర్ అమలుకు బ్రేక్ వేశారు. అప్పటి విధానాన్ని మళ్లీ కొత్త సర్క్యులర్ ద్వారా ఈనెల మొదటి తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశాలివ్వడం తాజా వివాదానికి కారణమైంది.
ముందుగా ఫిబ్రవరి 29న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయగా, ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ కమిషనర్ కూడా తమ డిపార్ట్ మెంట్ అధికారులకు మార్చి 2న దీని అమలుపై అదేశాలిచ్చారు. ఇన్నేళ్లుగా లిక్కర్ డిపోల నుంచి మద్యం స్టాక్ బయటకు వెళ్తున్న సమయంలో అందించే ఎక్సైజ్ శాఖ అధికారులు అందించే ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ కాపీతో మద్యం వాహనాలు ప్రయాణించేవి. కొత్త సర్క్యులర్ వచ్చిన తర్వాత మద్యం వ్యాపారులు వ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆన్ లైన్ ద్వారా ఇ–వే బిల్లు కాపీ తీసుకొని ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ కాపీకి అదనంగా తమకు చూపించాలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చెబుతున్నారు.
ఈనెల ఫస్ట్ నుంచి అడ్డుకుంటున్రు..
ఈనెల మొదటి తేదీ నుంచి ఈ– వే బిల్లు కాపీలు చూపించని వాహనాలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అడ్డుకుంటున్నారు. తమకు స్టాక్ అమ్ముతున్నది ఐఎంఎల్ డిపోనే కాబట్టి, ఈ– వే బిల్లును కూడా వాళ్లే అందించాలని మద్యం వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు రెండేళ్లకు మాత్రమే వ్యాపార లైసెన్స్ ఉంది కాబట్టి తమకు వ్యాట్ వర్తించదంటున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను తాము ఫాలో అవుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
వ్యాట్ తో మాకు సంబంధం లేదు
మద్యం అమ్మేందుకు కేవలం రెండేళ్ల లైసెన్స్ మాత్రమే మాకు ఇచ్చి వ్యాట్ పరిధిలోకి తీసుకురావడం సరికాదు. రాష్ట్రంలో ఇన్నేళ్లుగా అమలవుతున్న విధంగానే ఇప్పుడు కూడా అమలు చేయాలి. మాకు స్టాక్ ఇస్తున్న ఐఎంఎల్ డిపో నుంచి ఈ– వే బిల్లును జనరేట్ చేయాలి. మాకు అక్కడి నుంచి తప్పించి మరెక్కడా నుంచి స్టాక్ తెచ్చుకునే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు మాకు స్టాక్ అమ్ముతున్న వాళ్లే వ్యాట్ చెల్లించాలి.
- గుర్రాల శ్రీనివాస్ రెడ్డి, మద్యం వ్యాపారి
అభ్యంతరాలను అధికారులకు నివేదిస్తాం
సర్క్యులర్ ద్వారా ఈ–వే బిల్లు గురించి మాకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వెంటనే సర్క్యులర్ ను అమలు చేసి, వాహనాలను అడ్డుకోవడంతో ఇక్కడ వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. వ్యాట్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతాధికారులే. మద్యం వ్యాపారుల అభ్యంతరాలను కూడా అధికారులకు నివేదిస్తాం.
- నాగేంద్రరెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్