తెలంగాణ ఖజానాకు లిక్కర్ కిక్కు..తొమ్మిదేండ్లలో ఆదాయం ట్రిపుల్!

తెలంగాణ ఖజానాకు లిక్కర్ కిక్కు..తొమ్మిదేండ్లలో  ఆదాయం ట్రిపుల్!
  • 2015-16లో రూ.12,706 కోట్లు..
  • 2024-25లో రూ.34,600 కోట్లు
  • గత ఆర్థిక సంవత్సరం 369 లక్షల కేస్​ల లిక్కర్​, 
  • 531 లక్షల కేస్​ల బీర్ల అమ్మకం
  • ఈ సారి కొత్త లిక్కర్ పాలసీ.. 
  • ఇంకింత ఆదాయం పెరుగుతుందని అంచనా

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2015–6లో మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్​శాఖకు రూ.12,706 కోట్ల ఆదాయం వస్తే.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అది కాస్తా రూ.34,600 కోట్లకు చేరింది. అంటే తొమ్మిదేండ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విపరీతంగా అమ్ముడైంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే లిక్కర్​సేల్స్ అదనంగా 7 శాతం పెరగడం గమనార్హం. 2023–24లో ఎక్సైజ్ శాఖకు రూ.34,800 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కొత్త దుకాణాల దరఖాస్తుల కింద వచ్చిన రూ.2640 కోట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తే ఈ సారి అమ్మకాలు పెరిగాయని అధికారులు తేల్చారు. గడిచిన సంవత్సరం లిక్కర్ అమ్మకాలు 369 లక్షల కేసులు ఉండగా, అంతకు ముందు ఏడాది 362 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయి. అదే బీరు అమ్మకాలు మాత్రం కాస్త తగ్గాయి. 2023–24లో 548 లక్షల కేసుల బీరు అమ్ముడైతే, పోయినేడాది 531 లక్షల కేసులే అమ్ముడుపోయాయి. దీంతో 3 శాతం తగ్గుదల కనిపించింది. బీరు కంపెనీలు 15 రోజుల పాటు సరఫరా ఆపడమే కాకుండా ధరలు కూడా పెంచడంతో సేల్స్​పై ఎఫెక్ట్​ పడిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది ఎక్సైజ్ శాఖకు పన్నుల రూపంలో రూ.7వేల కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఇదే మేజర్​షేర్. కాగా, గతేడాది దరఖాస్తుల ద్వారా వచ్చిన రూ.2640 కోట్లు ఈ సారి లేకపోవడంతో, కేవలం అమ్మకాల ద్వారానే ఈ ఆదాయం సాధ్యమైందని అధికారులు వివరించారు. పండుగలు, సీజన్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో సేల్స్ పెరుగుతున్నాయి. అంతే కాకుండా ధరలు పెరిగినా లిక్కర్ కొనేవాళ్ల సంఖ్య తగ్గలేదు.

ఈ సారి మళ్లీ కొత్త లిక్కర్ పాలసీ

2023 ఆగస్టులో కొత్త లిక్కర్ పాలసీ (2023-–25) కింద 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండటంతో.. 2,620 మద్యం దుకాణాలకు రూ.2640 కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో పాత లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. గత ప్రభుత్వం లాగే ఆగస్టులోనే మొదలుపెట్టి ఆ తరువాత నుంచి ఇస్తారా లేక అక్టోబర్, నవంబర్​లోనే అప్లికేషన్లు తీసుకుని కొత్త లిక్కర్ పాలసీని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈసారి కూడా భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది. మూడునాలుగే వేల కోట్ల టార్గెట్​తో ముందుకు వెళ్లేలా బడ్జెట్​లోనూ ఆదాయ లక్ష్యాన్ని ప్రతిపాదించింది. ఇక మద్యం అమ్మకాల విషయానికొస్తే, తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఈ ఆదాయం బాగా పెరుగుతున్నది. ఒక్క కరోనా టైంలో మినహా మిగతా ప్రతి ఏడాది రాబడి పెరుగుతూ వచ్చింది. 2022-–23లో రూ.35,145 కోట్లు వచ్చాయి, అంతకుముందు 2021-–22లో రూ.30,783 కోట్లు వచ్చాయి. ఈ లెక్కలు చూస్తే, ప్రతి ఏటా మద్యం అమ్మకాలు, దాని నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూ వస్తున్నాయి. 2023–24లో కూడా ఈ ట్రెండ్ కొనసాగినట్లు కనిపిస్తున్నది. అయితే దరఖాస్తుల నుంచి వచ్చిన ఆదాయం ప్రత్యేకంగా ఉన్నాయి.