- రానున్న 3 రోజుల్లో మరో రూ.400 కోట్లు అంచనా
- 9 నెలల్లో ఆబ్కారీ ఖజానాకు రూ.2838.92 కోట్లు
- అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా టాప్
హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ.. వరుస సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ఊపందుకున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో రూ.713.25 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రతి రోజు సగటున రూ.80 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఇయ్యాల శుక్రవారం, దసరా శనివారం.. ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో ఈ మూడు రోజుల్లో మరో రూ.400 కోట్లు విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు రూ.350 కోట్ల విలువ చేసే లిక్కర్ సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే జోరుగా సాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు.
గడిచిన 9 నెలల్లో రూ.2,838.92 కోట్ల అమ్మకాలు
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రూ.2,838.92 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్‌షాప్స్‌తో పాటు 1,171 బార్లు ఉన్నాయి. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్‌షాప్స్‌లో కూడా లిక్కర్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దసరాను ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు నిలిచాయి.