- నాన్‌వెజ్, కేసులకు రూ. 25 కోట్ల ఖర్చు
- జిల్లాలో జోష్‌గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
సిద్దిపేట, వెలుగుః న్యూ ఇయర్ ఎక్సయిజ్ శాఖలో జోష్ పెంచింది. 2023 డిసెంబర్ చివరి ఐదు రోజుల్లో దాదాపు రూ. 32 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే 2024లో అదే ఐదు రోజుల్లో అమ్మకాలు ఏకంగా రూ. 40 కోట్లు దాటాయి. గతంలో కన్నా ఈసారి ఎక్సైజ్‌శాఖకు ఐదు రోజుల్లోనే దాదాపు 7.60 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31న జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. జనవరి 1న కూడా వైన్ షాపుల వద్ద కొనుగోలుదారులు క్యూ కట్టారు.
జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, మిరుదొడ్డి, చేర్యాల , హుస్నాబాద్ సర్కిళ్లలో 93 వైన్ షాపులు, 16 బార్ అండ్ రెస్టారెంట్ లున్నాయి. 2024 చివరి ఐదు రోజుల్లో రూ. 30.36 కోట్ల విలువైన 37,596 కేసుల లిక్కర్, 10.17 కోట్ల విలువైన 50,855 కేసుల బీర్ల అమ్ముడుపోయాయి. 2023 లో రూ. 24.80 కోట్ల విలువైన 31,575 కేసుల లిక్కర్, 8.11 కోట్ల విలువైన 40,563 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.
భారీగా మాంసం, కేకుల అమ్మకాలు
న్యూ ఇయర్ సందర్భంగా జిల్లాలో మాంసం, కేకుల అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా న్యూఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు మాంసం, కేకుల కోసం దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు చేసి వుంటారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31 నైట్ చాలామంది సామూహికంగా వేడుకలు జరుపుకున్నారు. కొన్నచోట్ల ఈవెంట్ నిర్వహకులు కూడా వేడుకలు నిర్వహించారు. దాదాపు అన్ని ఇండ్లలో నాన్ వెజ్ దావత్‌లు.. కేక్ కటింగ్‌లు జోరుగా సాగాయి. జనవరి 1న సెలవు కావడంతో గుళ్లలో సందడి పెరిగింది. సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడింది.
పోలీసుల భారీ బందోబస్తు
న్యూ ఇయర్ సందర్బంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేటతో పాటు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ పట్టణాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. మెయిన్ రోడ్లపై డ్రంకెన్ డ్రెవ్ టెస్టులు నిర్వహించారు. డిసెంబర్ 31 అర్థరాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు పోలీస్ కమిషరేట్ వ్యాప్తంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, 90 కేసులు నమోదయ్యాయి.