
- మద్యం కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు.. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్స్ బంద్
- తెలంగాణలో మాత్రం సర్కారుకు లిక్కరే ప్రధాన ఆదాయ వనరు
- ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో లిక్కర్‌తో రూ. 1.75 లక్షల కోట్ల ఆమ్దానీ
హైదరాబాద్, వెలుగు: పక్క రాష్ట్రం ఏపీలో లిక్కర్ సేల్స్ తగ్గుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. లిక్కర్ నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం.. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లను రద్దు చేసి సర్కారే మద్యం షాపులను నిర్వహిస్తున్నది. అయితే తెలంగాణలో మాత్రం ఆదాయమే లక్ష్యంగా లిక్కర్ సేల్స్‌ను పెంచుతున్నారు. టార్గెట్లు పెట్టి మరీ.. అమ్మకాలను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న లిక్కర్ సేల్స్ ఇందుకు ఉదాహరణ. ఎనిమిదేండ్లలో రూ.1.75 లక్షల కోట్లు కేవలం లిక్కర్ అమ్మకాల ద్వారానే ఖజానాకు చేరాయి. బీర్లు ఎక్కువఅమ్మితే పెద్దగా ఫాయిదా ఉండదని, లిక్కర్‌నే ఎక్కువ అమ్మాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. తెలంగాణలో 2018–19లో ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) 3.44 కోట్ల ఐఎంఎల్ కేస్లు అమ్ముడుపోతే... 2021–22లో 3.70 కోట్ల ఐఎంఎల్ కేస్లు సేల్ చేశారు. అదే ఏపీలో 2018–19లో 3.84 కోట్ల ఐఎంఎల్ కేస్లు అమ్మితే.. 2021–22లో 2.64 కోట్ల కేస్లు విక్రయించారు.
అక్కడ వైన్ షాపులు తగ్గిస్తే.. ఇక్కడ పెంచిన్రు
రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒకటీ రెండు బెల్టుషాపులు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే పది వరకు ఉన్నాయి. వాటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం దగ్గరుండి ప్రోత్సహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కరే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. లిక్కర్ సేల్స్ పెంచాలని కిందిస్థాయి అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వైన్ షాపులకు హైదరాబాద్‌లో రాత్రి 11 గంటల వరకు అనుమతిచ్చారు. వైన్ షాపుల సంఖ్యను పెంచారు. దీంతో 2,216గా ఉన్న వైన్స్ సంఖ్య 2,620కు చేరాయి. ఏపీలో 4,380 వైన్ షాపులు ఉంటే.. వాటిలో 1,500 దాకా తగ్గించారు. అక్కడ రాత్రి 10 గంటల వరకే అమ్మకాలకు అనుమతి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో మద్యంతో (వ్యాట్కలిపి) ఖాజానాకు వచ్చిన ఆదాయం రూ.10,238 కోట్లుగా ఉన్నది. ఇది క్రమంగా పెరుగుతూ ఏడేండ్లలో ట్రిపుల్ అయింది. ఏటా యావరేజ్‌గా రూ.3 వేల కోట్ల రాబడి పెరిగింది. ఎప్పటికప్పుడు వ్యాట్‌ను పెంచడం, లిక్కర్ రేట్ల పెంపు, వైన్ షాపుల కేటాయింపు అప్లికేషన్లు.. ఇలా అన్ని మార్గాల్లోనూ లిక్కర్ ద్వారా రాష్ట్ర సర్కారు భారీగా ఆమ్దానీ రాబట్టుకుంటున్నది. ఇవన్నిటితో కలిపి గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో వచ్చిన లిక్కర్ రాబడి రూ.30,507 కోట్లుగా ఉన్నది. 2018–19లో రూ.20,447 కోట్లుగా ఉన్నది. అంటే రెండేండ్ల కాలంలోనే రూ.6 వేల కోట్ల ఆమ్దానీ పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల మూడో వారం వరకు రూ. 22,105 కోట్లు రాష్ట్ర సర్కార్‌కు చేరింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లిక్కర్ రేట్లను ఐదుసార్లు ప్రభుత్వం పెంచింది.
వ్యాట్ లెక్కలు బయటకు చెప్తలే
రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్‌పై వస్తున్న ఆదాయంపై దాగుడు మూతలు ఆడుతున్నది. బడ్జెట్ లెక్కల్లో చెప్పే రాబడికి.. వస్తున్న దానికి 50% అదనంగా ఉంటున్నది. బడ్జెట్లో కేవలం ఎక్సైజ్ ఆదాయం చూపెడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ ఆఖరు వరకు రూ. 8,900 కోట్లు లిక్కర్‌తో వచ్చినట్లు ప్రభుత్వం లెక్కల్లో చూపెట్టింది. ఎక్సైజ్ వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ పేర్లతో వచ్చిన ఆదాయన్ని బయటపెట్టడం లేదు. ఇవి కలుపుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ ఆఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.15,800 కోట్లు. లిక్కర్ తయారీకి అవుతున్న ఖర్చు.. బయట ప్రభుత్వం నిర్ణయించినట రేట్లకు చాలా తేడా ఉంటుంది. ఒక్క బీరు బాటిల్ రూ.210కు అమ్మితే దాంట్లో రూ.190 ప్రభుత్వానికి సమకూరుతున్నది.ఈ ఎనిమిదేండ్లలో రూ.85 వేల కోట్లు కేవలం ఎక్సైజ్ వ్యాట్‌తో ఆమ్దానీ వచ్చింది. 2018–19లో ఎక్సైజ్ వ్యాట్ రూ. 9,473 కోట్లు ఉంటే... అది 2021–22 నాటికి రూ.13 వేల కోట్లు దాటింది.
ఎనిమిదేండ్లలో లిక్కర్‌పై రాష్ట్ర సర్కార్‌కు ఆదాయం ఇట్ల.. (రూ. కోట్లలో)
సంవత్సరం సర్కార్ చెప్పే ఆదాయం ఎక్సైజ్ వ్యాట్, డ్యూటీ మొత్తం
2014-15 3,317.67 6,921.11 10,238
2015-16 4,031.79 8,169 12,200
2016-17 5,772.80 8,320 14,092
2017-18 9,672.63 8,010.56 17,683
2018-19 10,974.14 9,473 20,447
2019-20 12,349.97 9,860 22,209
2020-21 14,699.83 11,705 26,404
2021-22 17,502 13,005 30,507
2022-23* 12,300 9,805 22,105
మొత్తం 90,617 85,268 1,75,885