డిసెంబర్ 31న రాత్రి 12 గంటల దాకా వైన్స్.. ఫోన్​ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్

డిసెంబర్ 31న రాత్రి 12 గంటల దాకా వైన్స్.. ఫోన్​ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్

 

  • న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో
  • రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్​,డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు
  • ప్రతి స్టేషన్ పరిధిలో ఐదు చెక్ పాయింట్లు 
  • హైదరాబాద్​లో ఫ్లైఓవర్లు క్లోజ్.. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు 
  • ఎయిర్ పోర్టుకు వెళ్లే వాళ్లకే ఓఆర్ఆర్, పీవీ ఎక్స్​ప్రెస్ వే పైకి అనుమతి

హైదరాబాద్‌‌, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో వైన్స్, బార్లు, పబ్బుల టైమింగ్స్​ను ఎక్సైజ్ శాఖ గంట పాటు పొడిగించింది. మంగళవారం మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12  గంటల వరకు ఓపెన్ ఉంచవచ్చని తెలిపింది. బార్లు, పబ్బులను అర్ధరాత్రి ఒంటిగంట దాకా నడిపించుకోవచ్చని చెప్పింది.న్యూఇయర్‌‌‌‌‌‌‌‌ వేడుకల నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సహా అన్ని జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్, డ్రగ్‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌ టెస్టులు నిర్వహించనున్నారు. రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ, పబ్లిక్ ప్లేసులలో న్యూసెన్స్ చేసే వారిపై కొరడా ఝుళిపించనున్నారు.  ఈవెంట్స్ జరిగే పబ్స్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌, రిసార్ట్స్‌‌‌‌‌‌‌‌, ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసర ప్రాంతాల్లో లోకల్, బ్లూ కోల్ట్‌‌‌‌‌‌‌‌ పోలీసులు గస్తీ నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌కు అర్ధరాత్రి ఒంటిగంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. 

120 డ్రగ్ డిటెక్షన్ కిట్స్.. 

డ్రంకన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ తో పాటు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయ్ సప్లయ్‌‌‌‌‌‌‌‌పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 5 చెక్‌‌‌‌‌‌‌‌ పాయింట్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సై స్థాయి అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించనున్నారు. గంజాయ్, డ్రగ్స్ ఎక్కువగా వినియోస్తున్న బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే గుర్తించారు. జిల్లా యూనిట్స్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది నమోదైన ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ల ఆధారంగా డ్రగ్స్, గంజాయ్ సప్లయర్ల కదలికలపై నిఘా పెట్టారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ సేవించిన వారిని గుర్తించేందుకు డ్రగ్‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్స్‌‌‌‌‌‌‌‌ టెస్టులు నిర్వహించనున్నారు. టీఎస్ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో(టీన్యాబ్‌‌‌‌‌‌‌‌) ఇప్పటికే 120కి పైగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ను కొనుగోలు చేసింది. ఇందులో 70 కిట్స్‌‌‌‌‌‌‌‌ను గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో, మరో 50 కిట్స్‌‌‌‌‌‌‌‌ను జిల్లాల్లో వినియోగిస్తున్నారు. 

మఫ్టీలో నిఘా.. 

న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌, లాఅండ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులతో పాటు మఫ్టీలో షీటీమ్స్‌‌‌‌‌‌‌‌, టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పోలీసులనూ మోహరించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల వారీగా ఇప్పటికే డ్యూటీ చార్ట్‌‌‌‌‌‌‌‌ వేశారు. ముఖ్యంగా పబ్స్‌‌‌‌‌‌‌‌, క్లబ్స్, రిసార్ట్స్‌‌‌‌‌‌‌‌ సహా డ్రగ్స్, గంజాయ్ హాట్‌‌‌‌‌‌‌‌స్పాట్స్‌‌‌‌‌‌‌‌గా గుర్తించిన ఏరియాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకన్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించి, బుధవారం తెల్లవారుజామున 7 గంటల వరకు నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. మరోవైపు డ్రగ్స్ సేవించి పట్టుబడినోళ్లపై ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి కేసుల్లో బెయిల్‌‌‌‌‌‌‌‌ లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్..  

న్యూఇయర్ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో ఆంక్షలు విధించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 172 ట్రాఫిక్ జంక్షన్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు. మార్కెట్స్‌‌‌‌‌‌‌‌, మాల్స్, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వైపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాలను అనుతించరు. లంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌, బేంగంపేట్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, పీవీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ వేలను‌‌‌‌‌‌‌‌ కూడా మూసేస్తారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టుకు వెళ్లే ప్రయాణికులను మాత్రమే వీటి పైకి అనుమతిస్తారు. కాగా, గ్రేటర్ లో ప్రతి స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చొప్పున దాదాపు 280కి పైగా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.

అర్ధరాత్రి దాకా మెట్రో..

మెట్రో రైళ్లు మంగళవారం అర్ధరాత్రి వరకు నడుస్తాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి రైల్ టెర్మినల్ నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. మెట్రో రైళ్లు చివరి స్టేషన్ కు అర్ధరాత్రి 1:15 గంటలకు చేరుకుంటాయని వెల్లడించారు. 

ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్..

న్యూఇయర్ ​సెలబ్రేషన్స్ నేపథ్యంలో ఫ్రీ క్యాబ్ సేవలు అందించనున్నట్టు తెలంగాణ గిగ్​అండ్​ప్లాట్ ​ఫామ్​ వర్కర్స్​ యూనియన్​, తెలంగాణ ఫోర్​వీలర్స్ ​అసోసియేషన్​ ప్రకటించాయి. డ్రంకన్ డ్రైవ్ యాక్సిడెంట్లను నివారించేందుకు తమ వంతు బాధ్యతగా ‘హమ్ ​ఆప్కే సాథ్​హై’ పేరుతో  ఈ సేవలు అందించనున్నట్టు తెలిపాయి. ‘‘మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఫ్రీ క్యాబ్ సేవలను అందిస్తాం. 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ప్రజలకు ఉచిత రవాణా సేవలు అందిస్తాం. క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు పొందాలనుకునేవారు 91776 24678కు ఫోన్​చేస్తే వచ్చేస్తాం” అని అసోసియేషన్ల అధ్యక్షుడు షేక్​సలావుద్దీన్​ తెలిపారు. 

స్పెషల్​టీమ్స్​తో ఎక్సైజ్ శాఖ తనిఖీలు.. 

న్యూఇయర్ వేడుకలపై ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ నిఘా పెట్టింది. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనుంది. ఈ మేరకు ఎక్సైజ్​ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టర్​వి.బి కమలాసన్​రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ‘‘న్యూఇయర్ వేడుకల్లో నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ లిక్కర్‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వాడొద్దు. మా తనిఖీల్లో అవి దొరికితే చర్యలు తప్పవు. ఈవెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు 42 స్టేట్‌‌‌‌‌‌‌‌, జిల్లా టాస్క్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ టీమ్స్ ఏర్పాటు చేశాం. ఇవి టీజీ న్యాబ్‌‌‌‌‌‌‌‌, పోలీసులతో కలిసి తనిఖీలు చేపడతాయి” అని అందులో పేర్కొన్నారు. లిక్కర్​వినియోగించేందుకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. నాన్​డ్యూటీ లిక్కర్​కనిపిస్తే కేసులు పెట్టి నిర్వాహకులను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. జనవరి 1న కూడా తనిఖీలు కొనసాగనున్నాయి.