మందుతోనే అన్ని పార్టీలు.. ఏడాదిలో రూ. 700 కోట్లు తాగేశారు..

మందుతోనే అన్ని పార్టీలు.. ఏడాదిలో రూ. 700 కోట్లు తాగేశారు..
  •  ఏటా రూ.30 కోట్ల మేర పెరుగుతున్న విక్రయాలు
  • రెండు వేలకుపైగా బెల్ట్ ​షాపులు.. పట్టించుకోని అధికారులు

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతు న్నాయి. జనాలుప్రతి అకేషన్​ను లిక్కర్​తోనే సెలబ్రేట్​చేసుకుంటున్నారు. ఈ కల్చర్​ క్రమంగా విస్తరిస్తుండడంతో దానికి తగ్గట్టే మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్​అధికారులు సైతం టార్గెట్లను చేరుకునేందుకు బెల్ట్​ షాపులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో జిల్లాలో లిక్కర్ ​సేల్స్​ ఏటా కోట్లలో పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జిల్లా వ్యాప్తంగా 73 వైన్స్, 16 బార్లు ఉన్నాయి. 

వీటి ద్వారా నిరుడు ఏప్రిల్​1 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు రూ.694.55 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ నెలాఖరు నాటికి మరో రూ.10 కోట్ల సేల్స్​ జరిగే చాన్స్​ ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు క్రాస్​ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిరుడు రూ.703.04 కోట్ల అమ్మకాలు క్రాస్​ అయ్యేలా కనిపిస్తోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత నాలుగేండ్లలో జిల్లాలో లిక్కర్ సేల్స్​ ఏటా సగటున రూ.30 కోట్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. 

విస్తరిస్తున్న లిక్కర్​ కల్చర్  

జిల్లాలో లిక్కర్​కల్చర్​ రోజురోజుకు విస్తరిస్తోంది. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి సందర్భంలో మద్యపానం తప్పనిసరి తంతుగా మారింది. పెండ్లిల్లు, ఫంక్షన్లు, పండుగలు, మొక్కులు, దినకర్మలు వంటి శుభ, అశుభ కార్యాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఫ్రెండ్స్​ కలిసినా, చుట్టాలొచ్చినా సుక్క ముక్కతోనే మర్యాద. బర్త్​డేలు, మ్యారేజ్ ​డేలు, గెట్​టుగెదర్, బిజినెస్ ​మీట్​లు అన్నింటా లిక్కర్​ ఉండాల్సిందే. సంతోషం కలిగినా, బాధ అనిపించినా సీసాలు ఖాళీ కావాల్సిందే. సింగరేణి కోల్​బెల్ట్, పారిశ్రామిక ప్రాంతం కావడంతో పొద్దంతా కష్టపడే కార్మికులు, పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకునే కర్షకులు, ఆఫీసుల్లో అలసిపోయే ఉద్యోగులు సాయంత్రం కాగానే ఉపశమనం కోసం ఓ రెండు పెగ్గులేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో యూత్, స్టూడెంట్లు మద్యానికి అలవాటుపడుతున్నారు. 

బీర్లకు పెరిగిన డిమాండ్

జిల్లాలో విస్కీ అమ్మకాలు కాస్త తగ్గిపోగా, బీర్ల​ సేల్స్​విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా మద్యం రుచి చూస్తున్న యువత పెద్ద ఎత్తున బీర్లు తాగుతుండ డమే ఇందుకు కారణం. 2020–-21లో జిల్లాలో 7.16 లక్షల ఐఎంఎల్ కేస్​లు అమ్ముడుపోగా, బీర్లు 6.80 లక్షల కేస్​లు ఖాళీ అయ్యాయి. మరుసటి ఏడాది 7.60 లక్షల కేస్​ల ఐఎంల్​, 8.15 లక్షల కేస్​ల బీర్లు సేల్​అయ్యాయి.

 అంటే 1.34 లక్షల బీర్  కేస్​లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. 2022–23లో ఐఎంఎల్​6.69 లక్షల కేస్​లకు తగ్గితే అదే సమయంలో బీర్​ కేస్​లు 10.38 లక్షలు సేల్ ​అయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.23 లక్షలు ఎక్కువ. 2023–24లో ఐఎంల్​ కేస్​లు 6.88 లక్షలు, బీర్లు 11.64 లక్షల కేస్​లు సేల్​అయ్యాయి. ఈ ఏడాది మార్చి 25 వరకు 6.32 లక్షల ఐఎంఎల్ ​కేస్​లు, 11.11 లక్షల బీర్​ కేస్​లు తాగేశారు. 

విచ్చలవిడిగా బెల్ట్​ షాపులు

జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్​ షాపులు వెలుస్తున్నాయి. ఊళ్లలో గల్లీకో దుకాణం కనిపిస్తోంది. కిరాణా షాపులే బెల్ట్​ షాపులుగా మారాయి. ఒక్కో ఊళ్లో కనీసం ఐదు నుంచి పది అడ్డాలు ఏర్పడ్డాయి. ఇలా జిల్లావ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్ట్​ షాపులు కొనసాగుతున్నట్టు ఓ అంచనా. వీటి పుణ్యమా అని లిక్కర్​ కల్చర్​ గ్రామాల్లోనూ సాగుతోంది. ఇంటి పక్కనే  బెల్ట్​ షాపులు ఉండడంతో ఎప్పుడంటే అప్పుడు మందు దొరుకుతోంది. అలా ఒకరినుంచి మరొకరికి అలవాటుగా మారి లిక్కర్​కు బానిసలవుతున్నారు. 

పెద్దలే కాకుండా కాలేజీ, హైస్కూల్​పిల్లలు కూడా నిర్భయంగా తాగుతున్నారు. సాయంత్రమైతే మత్తులో జోగుతున్నారు. ఒక్కో షాపులో రోజుకు సగటున రూ.5 వేల అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో నిత్యం సుమారు రూ.2 కోట్ల విలువైన లిక్కర్​ సేల్స్​జరుగుతుండగా, బెల్ట్​షాపుల ద్వారానే రూ.కోటి వ్యాపారం సాగుతోంది. 

జిల్లాలో లిక్కర్​ సేల్స్ వివరాలు

ఆర్థిక సంవత్సరం    సేల్స్​(రూ.కోట్లలో) 
2020-21        588.07
2021-22        636.99
2022-23        676.68
2023-24        703.04
2024-25        694.55         (ఈనెల 25 తేదీ నాటికి)