- ఉమ్మడి జిల్లాలో 31న భారీగా మద్యం అమ్మకాలు
- మంచిర్యాలలో డిసెంబర్లో రూ.75 కోట్లకు పైగా సేల్స్
- చివరి రెండు రోజుల్లోనే రూ.15 కోట్ల విక్రయాలు
ఆదిలాబాద్/మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ కిక్కిచ్చింది. మద్యం, మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 31 ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలతో పాటు బేకరీలు, చికెన్, మటన్ షాపులు, హోటళ్లు కస్టమర్లతో కిటకిటలాడాయి. గ్రామాల్లోని బెల్టు షాపుల్లో సైతం మద్యం కిక్కిచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31న రూ.16.08 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 7.30 కోట్ల విక్రయాలు జరగగా, నిర్మల్‌లో రూ.3.60 కోట్లు, ఆదిలాబాద్‌లో రూ.2.68 కోట్లు, ఆసిఫాబాద్‌లో 2.50 కోట్ల మద్యాన్ని అమ్మారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి మరింత పెరిగాయి. 29, 30, 31వ తేదీల్లో మంచిర్యాల జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల వ్యాపారం జరిగింది.
నవంబర్ కంటే రూ.30 కోట్లు అధికంగా సేల్స్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనం తాగి ఊగారు. డిసెంబర్లో అమ్మకాలు రూ.75 కోట్లు దాటాయి. చివరి రెండు రోజుల్లోనే రూ.15 కోట్ల సేల్స్జరిగాయి. గత నెల 1 నుంచి 29 వరకు రూ.61.34 కోట్ల అమ్మకాలు జరిగితే, 30న రూ.8 కోట్లు, 31న రూ.7.70 కోట్ల విలువైన మద్యాన్ని డిపో నుంచి లిఫ్ట్ చేశారు. నవంబర్‌లో రూ.44.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన డిసెంబర్లో అదనంగా రూ.30 కోట్ల సేల్స్రికార్డయ్యాయి.
డ్రంకెన్ డ్రైవ్ కేసులు
31న రాత్రి 10 గంటల నుంచి నిర్వహించిన స్పెషల్డ్రంకెన్ అండ్ డ్రైవ్తనిఖీల్లో పెద్దపల్లి కమిషనరేట్ పరిధిలో 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. వెయ్యికి పైగా నో హెల్మెట్ కేసులు బుక్ చేయగా, ర్యాష్ డ్రైవింగ్ కేసులు మరో వంద నమోదయ్యాయి. పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్‌తో కలిసి మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరిస్థితిని సమీక్షిం చారు. ఆదిలాబాద్జిల్లాలో 60 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
31వ తేదీన ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు
మంచిర్యాల రూ. 7.30 కోట్లు
నిర్మల్ రూ. 3.60 కోట్లు
ఆదిలాబాద్ రూ.2.68 కోట్లు
ఆసిఫాబాద్ రూ. 2.50 కోట్లు