న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్‌కు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులను రద్దు చేశామని స్పష్టం చేసింది. 2023 జులైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.
అభిషేక్ తరఫున అడ్వకేట్ వాదనలు కొనసాగిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అందరూ బెయిల్‌పై బయటే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అభిషేక్‌కూ సాధారణ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీని పై ఈడీ వాదనలు వినిపించాలని కోరగా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఎటువంటి అభ్యతరం తెలపలేదు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. అభిషేక్ కు బెయిల్ మంజూరు చేసింది.