
- వైన్స్ నుంచి నేరుగా కాటన్లకొద్దీ సరఫరా
- మద్యం డిపోలను తలపించేలా ఇండ్లలోనే స్టాక్
- బంద్ రోజుల్లోనూ ఇష్టారీతిన అమ్మకాలు
- ఎక్సైజ్, లోకల్ పోలీసులకు నెలవారీగా మామూళ్లు
- 24 గంటల సర్వీస్ తో రోడ్లపై తరచూ గొడవలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్వరంగల్ నగరంలో లిక్కర్ ఏరులై పారుతోంది. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లకు తోడు విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వరంగల్ ట్రై సిటీలో ఎనీ టైమ్ మందు దొరుకుతోంది. అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుండగా.. మందు బాబులు ఫూటుగా తాగి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. బెల్టుషాపులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, లోకల్ పోలీస్ ఆఫీసర్లు మామూళ్ల మత్తులో లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గల్లీకో బెల్ట్ షాప్.. విచ్చలవిడిగా సేల్స్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 వైన్స్, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా.. అందులో సగం వరకు వరంగల్ ట్రై సిటీ పరిధిలోనే ఉన్నాయి. వాటికి తోడు వరంగల్ నగరంలో ప్రతి గల్లీకో బెల్ట్ షాప్ వెలిసింది. నగరంలో కేయూ పీఎస్ పరిధి గుండ్ల సింగారం, గోపాలపూర్, కోమటిపల్లి, నిరూప్ నగర్ తండా, హసన్ పర్తి స్టేషన్ పరిధిలోని హసన్ పర్తి, పెగడపల్లి, దేవన్నపేట, సుబేదారి పీఎస్ లో వడ్డేపల్లి, ఎన్జీవోస్ కాలనీ, మైత్రీనగర్, మిల్స్ కాలనీ పరిధి కరీమాబాద్, శాకరాసికుంట, ఎస్ఆర్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా నడుస్తోంది.
సిటీవ్యాప్తంగా కిరాణాషాపుల్లో నడుస్తున్న బెల్టుషాపులే వెయ్యికిపైగా ఉన్నట్లు అంచనా. ముందస్తు ఒప్పందం ప్రకారం వైన్స్ ఓనర్లు ప్రతి బాటిల్ పై రూ.10 అదనంగా వసూలు చేసి, కావాల్సినంత సరుకు సప్లై చేస్తుండగా.. బెల్ట్ షాపులు ఓనర్లు ప్రతి సీసా రూ.30 నుంచి రూ.50కి తగ్గకుండా దండుకుంటున్నారు.
బంద్ రోజుల్లో కూడా ఫుల్లు
సాధారణంగా ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, ఏవైనా ఎలక్షన్స్, గణేశ్ నిమజ్జనం, తదితర సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బంద్ఉండే రోజుల్లో వరంగల్‌లో మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. . టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టి రెండు రోజుల్లోనే దాదాపు రూ.6.48 లక్షల విలువైన వందలాది కాటన్ల బీర్లు, ఇతర లిక్కర్ సీసాలను సీజ్ చేశారు.
మద్యం మత్తులో దాడులు
ఇక పెండ్లి బరాత్ ల సమయంలో కూడా అక్కడికే పరుగులు తీస్తున్నారు. అక్కడ లేట్ నైట్ వరకు తాగి రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు. ఎర్రగట్టుగుట్ట శ్రీనివాసనగర్ కాలనీలో శివరాత్రి రోజున కొంతమంది యువకులు మద్యం మత్తులో హల్చల్ చేయగా.. పక్కనే లేడీస్ హాస్టల్స్ ఉన్నాయన్న కారణంతో అక్కడున్న ఓ వ్యక్తి వారికి అభ్యంతరం చెప్పాడు. ముగ్గురు యువకులు ఆయనపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. గీసుగొండ పీఎస్ పరిధిలో యువకులు ఆటో డ్రైవర్ పై దాడికి దిగారు.
ఎల్కతుర్తి పీఎస్ పరిధి బావుపేటలో ఓ పెండ్లి బరాత్ సందర్భంగా ఓ వ్యక్తి మద్యం మత్తులో డీజే ఆపరేటర్ పై కత్తితో గొంతు కోయగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. 2024 ఆగస్టులో కాజీపేట బస్టాండ్ సమీపంలో సిద్దిపేట జిల్లాలో పని చేసే ఓ సీఐ కొడుకు వీరంగం సృష్టించాడు. రాత్రంతా స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగిన ఆయన కాజీపేట బస్టాండ్ సమీపంలోని పబ్లిక్ ప్లేస్ లో మూత్రం పోస్తుండగా.. అభ్యంతరం చెప్పిన క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేశాడు. దీంతో డ్రైవర్ ఆసుపత్రి పాలయ్యాడు.
లైట్ తీసుకుంటున్న అధికారులు
వరంగల్ నగరంలో బెల్టు షాపులు 24 గంటల పాటు దందా సాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్సైజ్ ఆఫీసర్లు, లోకల్ పోలీస్ఆఫీసర్లు మామూళ్లకు అలవాటుపడి తనిఖీల ఊసే ఎత్తడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోనే బెల్టు షాపుల నిర్వాహకులు దర్జాగా దందా సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెల్టుషాపులతో ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైనా లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనిఖీలకు వస్తున్నట్టుగా ముందస్తుగా సమాచారం ఇచ్చి నామమాత్రంగా సోదాలకు వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
24 గంటల పాటు మద్యం లభిస్తుండటం అనర్థాలకు దారి తీస్తుండగా.. కట్టడి చేయాల్సిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెల్టుషాపులపై ఫోకస్ పెట్టి, మద్యంబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.