75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. మన రాజ్యాంగం గొప్పతనాన్ని తెలుపుకున్నాం. గత 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం 106 సవరణలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ 140 కోట్ల దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడవడానికి ఒక వారధిగా నిల్చింది. అయితే, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలుచేసే వ్యక్తి చెడ్డవాడైతే అదికూడా చెడ్డగా మారుతుంది. ఆచరణలో పెట్టేవారు మంచివారైతే అది మంచిగా పనిచేస్తుందని డా. బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నారు.
వివిధ దేశాల పాలనలోని మంచిని గ్రహించి మన దేశ స్థితిగతులను, మన ప్రాచీన సంస్కృతులను బట్టి మన జీవనవిధానాల ఆధారంగా దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టించి మన రాజ్యాంగ నిర్మాతలు, మేధావులు మనకు లిఖిత రాజ్యాంగాన్ని అందించారు. 75 సంవత్సరాలు గడిచినప్పటికీ హక్కుల గురించి మాట్లాడుతున్నాం కానీ మన బాధ్యతలను గుర్తించలేకపోతున్నాం. భారత రాజ్యాంగంలోని 47వ అధికరణము ప్రకారం ప్రజల ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలు, మాదకద్రవ్యాల వాడకంపై నిషేధం విధించాలని ప్రజలు సేవించకుండా చూడాలని తెలియచెప్పింది.
రాజ్యాంగంలోని 4వ భాగమైన రాజ్యవిధానపు ఆదేశిక సూత్రాలు దేశపరిపాలనలో ప్రభుత్వాలు సాధించవలసిన లక్ష్యాలను గురించి వివరిస్తున్నాయి. ఆదేశసూత్రాలలో 47వ అధికరణ ప్రకారం రాష్ట్రాలు మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలుచేయాలి. దానితో ఆర్థిక ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి ప్రజలు వివిధ రీతుల్లో ఆలోచించడానికి అవకాశముంది. ఆర్థిక అసమానతలు తగ్గి సామాజిక సమానత్వం ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి ఉత్పత్తి, వినియోగంలో పాల్గొనడం వలన జి.డి.పి. పెరుగుతుంది. పేదరికం నిర్మూలన, సమాన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈనాడు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న యునైటెడ్ స్టేట్స్ 1920–-1933 కాలంలో మద్య నిషేధం అమలుచేసింది. అదేవిధంగా ఐస్లాండ్, ఫిన్లాండ్, కెనడా, నార్వే , ముస్లిం మెజారిటీ దేశాలు మద్యనిషేధంను కఠినంగా దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నర దశాబ్దకాలంగా అమలుచేసి ఆ తరువాత నకిలీమద్యం అరికట్టడం కోసం రద్దు చేసుకున్నాయి.
ఆబ్కారీ ఆదాయంపై ఆధారపడుతున్న రాష్ట్రాలు
దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఆబ్కారీశాఖ ద్వారా వచ్చే ఆదాయంపై నడుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో బడులు లేని గ్రామాలు ఉండవచ్చునేమో కాని బెల్టుషాపులు లేని గ్రామాలు లేవు. ఆబ్కారీశాఖ ద్వారా వస్తున్న ఆదాయంతో అభివృద్ధి రూపంలో మౌలిక సదుపాయాలను కల్పించవచ్చునేమో కానీ ఆర్థిక సమానత్వాన్ని సాధించలేం. అభివృద్ధిచెందే క్రమంలో కనీసం 15 సంవత్సరములు మద్యపాన నిషేధం అమలుపరిస్తే ప్రజలు తమ కాళ్ళమీద తాము నిలబడి ఆర్థిక పరిపుష్టి లభించిన తరువాత మద్యం మనిషికి ఎంత అవసరమో తెలుసుకుంటాడు. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు కేవలం వారాంతపు రోజుల్లోనే మద్యం సేవిస్తారు, అదికూడా లిమిటెడ్ గానే. కానీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మధ్యాహ్నం పూటనే బార్లు ఫుల్‌గా ఉంటాయి. దీనివలన ఎక్కువగా యువత బలి అవుతున్నారు. ప్రపంచదేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువగా యువత ఉన్నది. వారు చెడు మార్గాన్ని అవలంబిస్తే దేశానికి తీరని నష్టం. ఏవిధంగానైతే నిర్బంధ విద్య అమలులో ఉందో అలాగే సంపూర్ణ అక్షరాస్యత వచ్చేవరకు మద్యపాన నిషేధం కూడ అవసరం. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. నిషేధానికి తాత్కాలికంగా సవాళ్ళు ఉన్నప్పటికీ దానివలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. నేరాలు, ప్రమాదాలు తగ్గుతాయి. మద్యం సేవించడం మన ప్రాథమిక హక్కు కాదు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా రాజ్యాంగం 47వ అధికరణ ప్రకారం మద్యపాన నిషేధానికి పూనుకొని గుజరాత్, బిహార్ రాష్ట్రాల మాదిరిగా సాహసం చేయాలి.
మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా మద్యపాన నిషేధం
ఇప్పటికీ ముస్లిం దేశాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. మన భారతదేశంలో గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో బొంబాయి నిషేధ చట్టం 1949 ఆధారంగా ఇప్పటికీ అమలులో ఉంది. గుజరాత్ రాష్ట్రం 1960లో మహారాష్ట్ర నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా మద్యపాన నిషేధం అమలును కొనసాగిస్తున్నారు. మద్యం లేకుండా సమాజం శాంతియుతంగా ఉంటుందని వారి ఆలోచన. బిహార్‌లో నిషేధం విధించిన ఒక సంవత్సరంలోనే హత్యలు, అల్లర్లు, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. ప్రభుత్వాలు నేరాలను నిరోధించడానికి అయ్యే ఖర్చు కూడా తగ్గింది.
అక్కడి ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరిగింది. విచ్చలవిడిగా మద్యపానం ఉన్నచోట ముఖ్యంగా ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉన్న మనదేశంలో మద్యానికి బానిసలు అవుతున్నారు. ఎటువంటి పనులు చేయకుండా సమాజానికి భారం అవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు. పిన్నవయసులోనే మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడుతున్న విషయం మనం చూస్తున్నాం. 1991 సంవత్సరంలో ఉమ్మడి ఏపీలోని కలిగిరి మండలం దోమగుండ రోశమ్మ సారాయి వ్యతిరేక ఉద్యమం చేపట్టింది. అప్పట్లో ఆ ఉద్యమానికి చేయూతనిచ్చి ఎన్.టి. రామారావు 1994 అధికారంలోకి వచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చినప్పటికీ పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా వస్తున్న మద్యాన్ని ఆపలేకపోయినారు. దానితో 3 సంవత్సరాల కాలంలో మద్యపాన నిషేధంను ఎత్తివేశారు.
- సోమ శ్రీనివాసరెడ్డి,
కార్యదర్శి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్