రూ.7 లక్షల విలువైన మద్యం పట్టివేత

రూ.7 లక్షల విలువైన మద్యం పట్టివేత

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం వద్ద ఓ గోడౌన్ లో అక్రమంగా నిల్వ  ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 90 ఎంఎల్ క్వాంటిటీ సీసాలతో కూడిన 90 కాటన్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్‌‌డీపీఎల్‌‌)ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.7 లక్షల వరకు ఉంటుందని అంచనా. 

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సోదాలు చేయగా మద్యం పట్టుబడినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌‌ మహిపాల్ రెడ్డి తెలిపారు.  అయితే ఈ గోడౌన్‌‌లో మద్యం ఎవరు ఎందుకు నిల్వ చేశారన్నది దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. దాడుల్లో సుల్తానాబాద్, పెద్దపల్లి ఎస్‌‌హెచ్‌‌వోలు గురునాథ్ రాథోడ్, శిరీష పాల్గొన్నారు.