ప్రపంచంలోని బెస్ట్ పెయింటింగ్స్‌లో మోనాలిసా బొమ్మ ఒకటి. 16వ శతాబ్దంలో ఇటలీ చిత్రకారుడు లెనార్డో డావిన్సీ గీసిన ఈ బొమ్మలోని మహిళ నవ్వుతోందా? ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదా? ముభావంగా ఉందా? అనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మోనాలిసా మనదేశంలో పుట్టి పెరిగితే ఆ పెయింటింగ్‌లో ఎలా కనిపించేది? ఆమెని ఏ పేరుతో పిలిచేవాళ్లు? అని ఆలోచించిన వాళ్లూ ఉన్నారు. ట్విట్టర్ యూజర్ పూజా సాంగ్వాన్కి కూడా అదే ఆలోచన వచ్చింది. ‘భారతీయ మహిళగా మోనాలిసా ఇలా ఉంటుంద’ని చెప్పడం కోసం తనే మోనాలిసాలాగ రెడీ అయింది. ఫొటోలు దిగి, వాటిని రెండు రోజుల కింద ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి.
బ్లాగర్, ఫొటోగ్రాఫర్ అయిన పూజకు ఎదుటివాళ్ల ఎమోషన్స్‌ని కెమెరాలో బంధించడం అంటే చాలా ఇష్టం. మోనాలిసా పెయింటింగ్‌ని చూడగానే.. మోనాలిసా మనదేశంలో ఏదో ఒక రాష్ట్రంలో పుట్టి పెరిగితే, చీరకట్టులో ఎలా ఉండేదో చెప్పాలనుకుంది. అలాగని ఫొటోషాప్ చేయాలనుకోలేదు. ఆ ఇటాలియన్ బొమ్మకు భారతీయ సొబగులు అద్దాలని తనే మోనాలిసా లాగ తయారైంది. అచ్చం మోనాలిసా లాగనే ముఖం పెట్టి, ఎడమ చేయిపై కుడి చేయిని పెట్టుకొని ఫొటోలు దిగింది పూజ. అంతేకాదు బ్యాక్‌డ్రాప్‌లో ఆయా రాష్ట్రాల్లోని ఫేమస్ ప్లేస్‌లు, కట్టడాలు కనిపించేలా చూసుకుంది.
తెలంగాణ ఆడపడుచుగా...
మోనాలిసా ఒకవేళ తెలంగాణలో పుట్టి పెరిగితే.. పెయింటింగ్‌లో ఆమె పట్టుచీర కట్టు కుని ఉండేది. బ్యాక్‌డ్రాప్‌లో గోల్కొండ కోట కనిపించేది. ఇక్కడి వాళ్లంతా ఆమెని ‘లిసా బొమ్మ’ అని పిలిచేవాళ్లు. ఆమె ఢిల్లీలో పుట్టి ఉంటే... మెడలో ముత్యాల పూసల దండ, వేలాడే చెవి కమ్మలతో ఉన్న మోనాలిసాని ‘లిసా మౌసీ’ అనేవాళ్లు. మహారాష్ట్రలో పెరిగిన మోనాలిసా కొప్పున పూలు, పాపిట బిళ్ల, నుదుట ఎర్రని బొట్టు, మెడలో వజ్రాల హారం, ముక్కుకి ముక్కెర, చేతికి పెద్ద ఉంగరం పెట్టుకొని ‘లిసా తాయ్’గా పేరుగాంచేది. రాజస్తాన్ రాజవంశంలో పుడితే ‘మహారాణి లిసా’ గా చరిత్రలో నిలిచేది. కేరళ ఓనం వేడుకలో బంగారు అంచు పట్టుచీర కట్టుకున్న ఆమెని ‘లిసా మోల్’ అనేవాళ్లు. కోల్‌కతాలో ‘సోనా లిసా’, గుజరాత్లో లిసా బెన్’, బీహార్‌లో ‘లిసా దేవి’గా మోనాలిసా పేరు మార్మోగిపోయేది. మోనాలిసాని భారతీయ మహిళగా చూపించిన పూజ క్రియేటివిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.