ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో..మహిళా ఓటర్లే కీలకం

  • లోక్ సభ పరిధిలో42,479  మంది మహిళలు అధికం
  • నేతల తలరాతలు మార్చనున్న మహిళా ఓటర్లు 
  • మొత్తం ఓటర్లు 16,44,715 మంది  

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 16,44,715 మంది ఉండగా, అందులో పురుషులు 8,02,575 మహిళలు 8,42,054 మంది, ఇతరులు 86 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 42,479 మంది ఎక్కువగా ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక్క సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా నమోదు చేసుకున్నారు.

దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఓటరు జాబితాతోపాటు ఓటింగ్ లోనూ ప్రతి ఎన్నికల్లో మహిళలు సత్తాచాటుతున్నారు. ప్రస్తుతం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇంకా గడువు ఉండడంతో ఓటర్ల  సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో నేతల తలరాతలను మార్చేందుకు మహిళా ఓటర్లు సిద్ధమవుతున్నారు. 

మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా..

ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అధికారులు వందశాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ప్రతిసారి ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీల్లో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తుంటాయి. ఓటరు జాబితాలోనే కాదు..  ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలు ముందుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే 20 వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయా పార్టీలు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతోపాటు ఆరు గ్యారెంటీ పథకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహిళా ఓటర్లపై ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా మంత్రి సీతక్కను నియమించి జిల్లాలో విస్త్రత కార్యక్రమాలు చేపడుతోంది. మహిళలకు తమ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా మిగతా పార్టీలు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 

ఇంకా సమయం ఉంది..

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అర్హులైన వారు ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఇంకా సమయం ఇచ్చింది. ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఓటు నమోదుపై కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని

ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యువత ఓటు నమోదు చేసుకోవడంతోపాటు ఓటు హక్కు వినియోగించుకునేలా తగు చర్యలు చేపట్టారు. దీంతో ఏప్రిల్ 15 న విడుదలయ్యే తుది ఓటరు జాబితాలో మరికొంతమంది ఓటర్లు పెరిగే అవకాశం ఉంది.