- కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్మధు యాష్కీ గౌడ్
- నిజామాబాద్‌లో పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ
నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పేర్లను మొదట ప్రకటించాలని హైకమాండ్‌ను కోరామని పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్మధు యాష్కీ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలోని క్యాండిడేట్ల లిస్టు 15 రోజుల్లో వెలువడే అవకాశం ఉందన్నారు. బుధవారం నిజామాబాద్ టౌన్లో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. బహుజన వర్గాలన్నీ పార్టీకి దగ్గరైతైనే అధికారంలోకి వస్తామని.. 2004, 2009లో అదే జరిగిందన్నారు.
దూరమైన వర్గాలను కాంగ్రెస్‌కు చేరువ చేయాలన్నారు. సమాజంలో సగభాగమున్న వర్గాలకు రాజ్యాధికారంలో వాటా కావాలని, పోటీ చేసేందుకు చాన్స్ఇస్తేనే అది సాధ్యమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు టికెట్లు ఇచ్చినప్పుడు పార్టీలోని ధనవంతులైన పెద్ద లీడర్లు వారిని గెలిపించే బాధ్యతను తీసుకోవాలన్నారు. ముస్లిం మైనారిటీల గర్జన ఈ నెల 27న నిర్వహించే ఆలోచన ఉందన్నారు. తెలంగాణను సగమే సాధించామని.. సంపూర్ణ, సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
దొరల పాలనలో బడుగు, బలహీన వర్గాలకు నష్టం జరుగుతోందన్నారు. సచివాలయం ఎదుట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఆయన ఆశయాలను మాత్రం మరిచారన్నారు. చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలను సమర్థించొద్దన్నారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని సామాజిక సమతుల్యతనే కోరుతున్నామన్నారు.
కమిటీల్లోనే చోటియ్యలేదు.. టికెట్లిస్తరా?: ఈరవత్రి అనిల్
పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీలో 29 మంది ప్రతినిధులు ఉంటే అందులో బీసీలు ఐదుగురే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్నారు. స్క్రీనింగ్కమిటీకి వచ్చేసరికి ఒక్కరూ లేరన్నారు. కమిటీల్లో బలహీన వర్గాల భాగస్వామ్యమే లేనప్పుడు టికెట్లు ఎలా ఇప్పిస్తారని, బీసీలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర లీడర్లను కోరారు.
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్గౌడ్, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యేగంగారాం, మాజీ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ నగేష్‌రెడ్డి, నాయకులు తాహెర్, గడుగు గంగాధర్, కాసుల బాల్‌రాజ్, ప్రేమ్లతాఅగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.