T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024.. రిటైర్మెంట్ ప్రకటించిన 9 మంది ప్లేయర్లు వీరే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024.. రిటైర్మెంట్ ప్రకటించిన 9 మంది ప్లేయర్లు వీరే

టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసింది. 20 జట్లతో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ  టోర్నీలో రోహిత్ సారధ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ కొంతమందికి తీపి జ్ఞాపాకాలను మిగిలిస్తే.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వరల్డ్ కప్ అనంతరం ఏకంగా 9 మంది క్రికెటర్లు అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 

1) విరాట్ కోహ్లీ:  
 
టీమిండియా కింగ్‌ కోహ్లీ.. టీ20లకు గుడ్‌ బై చెప్పాడు. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌తో తన చివరి మ్యాచ్‌ ఆడేసిన విరాట్‌ కప్‌తో పొట్టి ఫార్మాట్‌ను చిరస్మరణీయంగా ముగించాడు.  ఫలితంగా రెండోసారి టీ20 వరల్డ్‌ కప్‌ను అందించి తిరుగులేని చాంపియన్‌గా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన విరాట్‌ కెరీర్‌లో 125 టీ20లు ఆడాడు. 137 స్ట్రయిక్‌ రేట్‌తో 4188 రన్స్‌ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ‘ఇది నా చివరి టీ20 మ్యాచ్.  తర్వాతి తరానికి అవకాశం ఇచ్చే సమయం వచ్చేసింది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

2) రోహిత్ శర్మ 

వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నట్లు తెలిపారు.159 టీ20మ్యాచ్‌లలో రోహిత్  4 వేల 231 పరుగులు చేశాడు.   ఐదు సెంచరీల అత్యధిక రికార్డును కూడా రోహిత్ కలిగి ఉన్నాడు.32 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 2007లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమ్ లో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు.

3) రవీంద్ర జడేజా   

సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని  ధృవీకరించాడు.ధోనీ నాయకత్వంలో జడేజా ఫిబ్రవరి 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ళ తన టీ20 క్రికెట్ లో జట్టు ఆల్ రౌండర్ గా సత్తా చాటాడు. మొత్తం 74 టీ20 మ్యాచ్ ల్లో 515 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ బౌలింగ్ లో 54 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన చివరి టీ20 మ్యాచ్ లో జడేజా 2 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్ లో ఒక ఓవర్ వేసి 12 పరుగులు సమర్పించుకున్నాడు. 

4) డేవిడ్ వార్నర్ 

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు ఈ ఆసీస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు. 110 టీ20ల్లో ఓ సెంచరీతో 3277 పరుగులు చేశాడు.   

5) ట్రెంట్ బోల్ట్ 

న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్ ఉగాండాపై అద్భుత బౌలింగ్ చేసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన రిటైర్మెంట్  నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేశాడు. 2011లో బోల్ట్ న్యూజిలాండ్ తరుపున అరంగేట్రం చేశాడు. దశాబ్ద కాలంగా కివీస్ జట్టులో కీలక బౌలర్ గా రాణించాడు. కివీస్ తరపున తొలిసారి 2014లో ఈ 34 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ వరల్డ్ కప్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 5 టీ20 వరల్డ్ కప్ లో బోల్ట్ కివీస్ తరపున ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా T20 ఫ్రాంచైజీ క్రికెట్‌ను ఆడాలనే నిర్ణయాన్ని బోల్ట్ తెలియజేశాడు. తన కెరీర్ లో 60 టీ20 మ్యాచ్ ల్లో 81 వికెట్లు పడగొట్టాడు.

6) డేవిడ్ వీస్‌:  
 
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, నమీబియా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌(39) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఓటమి తరువాత వీస్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఔటై డగౌట్‌కు వెళ్తున్న సమయంలో ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ప్రేక్షకులకు, సహచరులకు చేతులు ఊపుతూ తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పాడు. నమీబియా తరపున 34 టీ20ల్లో 532 పరుగులు, 35 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీస్‌.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్నాడు.

7) సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్

నెదర్లాండ్స్ బ్యాటర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ 83 పరుగుల భారీ తేడాతో ఓడిపోయివడంతో ఈ డచ్ బ్యాటర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 12 టీ20ల్లో 31 యావరేజ్ తో 280 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో 24.5 సగటుతో 98 పరుగులు చేసి.. నెదర్లాండ్స్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

8) మహ్మదుల్లా రియాద్

బంగ్లాదేశ్ వెటరన్ ఆల్-రౌండర్ మహ్మదుల్లా రియాద్ వరల్డ్ కప్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుండి అధికారికంగా రిటైర్మెంట్ అవుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. 17 ఏళ్లుగా బంగ్లాదేశ్ తరపున ఆడిన ఈ ఆల్ రౌండర్ ఓటమితో వీడ్కోలు పలికాడు. 2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు.

9) బ్రియాన్ మసాబా

2024 టీ20 ప్రపంచ కప్ లో ఉగాండ ప్లేయర్ బ్రియాన్ మసాబా తన అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ 61 టీ20 ల్లో 437 పరుగులు చేసి 23 వికెట్లు తీసుకున్నాడు.