T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. మర్చిపోలేని సూపర్ ఓవర్ మ్యాచ్ లు ఇవే

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. మర్చిపోలేని సూపర్ ఓవర్ మ్యాచ్ లు ఇవే

టీ20 మ్యాచ్ లంటే అభిమానులకు ఎక్కడ లేని మజా దొరుకుతుంది. ఇక టీ20 వరల్డ్ కప్ అయితే అంతకుమించి ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ మ్యాచ్ లు అన్ని ఒక లెక్కయితే సూపర్ ఓవర్ లెక్క వేరు. సూపర్ ఓవర్ అంటే ఆ కిక్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఇదే వరల్డ్ కప్ లో జరిగితే ఆ కిక్ డబుల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ ల ఫలితాలు సూపర్ ద్వారా వచ్చాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు 5 సూపర్ ఓవర్ లు జరిగితే రెండు ఈ వరల్డ్ కప్ లోనే నమోదయ్యాయి. వాటిని ఇప్పుడు ఒకసారి చూద్దాం.  

భారత్ vs పాకిస్తాన్, డర్బన్ 2007

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఇరు జట్ల స్కోర్లు (141) సమం కావడంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది. అప్పట్లో సూపర్ ఓవర్ బౌల్ ఔట్ విధానంలో ఉండేది. అనగా ఇరు జట్లలో ఆరుగురు వేరు వేరు బౌలర్లు ఒక బంతి మాత్రమే వేయాల్సి ఉంటుంది. బౌలర్ వేసిన బంతి వికెట్లను తగిలితే ఒక పాయింట్ ఇస్తారు. ఇలా ఓవర్ లో ఎవరు ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో భారత్ 3-0 తేడాతో పాక్ పై విజయం సాధించింది. టీ -20 క్రికెట్ చరిత్రలో ఇది ఏకైక బౌల్ ఔట్ మ్యాచ్ కావడం విశేషం. 

న్యూజిలాండ్ vs శ్రీలంక, పల్లె కెలే, 2012

2012లో శ్రీలంక వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో ఆతిధ్య శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ అభిమానులను థ్రిల్ కు గురి చేసింది. ఇరు జట్లు 174 పరుగులు చేయడంతో సూపర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఒక వికెట్ కు13 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేయడంతో 6 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. 

న్యూజిలాండ్ vs వెస్టిండీస్, 2012

పల్లెకెలెలో వెస్టిండీస్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ లోలో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. ఇరు జట్లు 140 పరుగులే చేశాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. అనంతరం గేల్, శామ్యూల్స్ చెరో సిక్సర్ బాదడంతో వెస్టిండీస్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. 

ఒమన్, నమీబియా.. బార్బడోస్ 2024

ప్రస్తుత టీ20వరల్డ్ కప్ లో భాగంగా జూన్  03వ తేదీ సోమవారం నమీబియా vs ఒమన్ జట్ల  మధ్య జరిగిన మ్యాచ్  టైగా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్ లో నమీబియా జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్  చేసిన నమీబియా జట్టు 6 బంతుల్లో 21 పరుగులు చేసింది.  ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వైస్, గెర్హార్డ్ ఎరాస్మస్ అదరగొట్టారు.  

అనంతరం బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు కేవలం 11 పరుగులు మాత్రమే చేయడంతో  నమీబియా సూపర్ ఓవర్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంతకుముందు ఒమన్  జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకు అలౌట్ అయింది.  అనంతరం  నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల కొల్పోయి 109 పరగులు మాత్రమే చేయగలిగింది. 

అమెరికా vs పాకిస్తాన్, డల్లాస్, 2024

తాజాగా గురువారం (జూన్ 6) పాకిస్థాన్, అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా కూడా 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ లో అమెరికా 18 పరుగులు చేస్తే.. పాక్ 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల సంచలన విజయం సాధించింది.