వెలుగు స్పోర్ట్స్ డెస్క్: గతేడాది వరుస టోర్నీలతో ఉక్కిరిబిక్కిరి అయిన క్రీడాభిమానులకు ఈసారి మరో పెద్ద పండగ రాబోతున్నది. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించే పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనుంది. దాంతో పాటు క్రికెట్ ఫ్యాన్స్‌కు అతిపెద్ద కిక్ ఇచ్చే టీ20 వరల్డ్ కప్‌కు కూడా సమయం రానే వస్తోంది. మార్చి నుంచి మొదలుపెడితే ఆగస్టు వరకు ఇండియాతో పాటు చాలా దేశాలు క్రీడల్లో మునిగిపోనున్నాయి. మధ్యలో టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్, యూరో కప్‌తో పాటు మరికొన్ని పెద్ద ఈవెంట్లు ఈ ఏడాది సందడి చేయనున్నాయి. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేద్దాం..!
టీ20 వరల్డ్ కప్ (జూన్ 4 నుంచి 30)
వన్డే వరల్డ్‌కప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా ఈ ఏడాది ఆడబోతున్న బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది. జూన్ 4 నుంచి 30 వరకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి. 2007లో ధోనీ సారథ్యంలో తొలిసారి కప్ గెలిచిన తర్వాత ఇండియాకు మళ్లీ ఆ అదృష్టం దక్కలేదు. చాలాసార్లు ప్రయత్నించినా అందని ద్రాక్షగా మారిన ఈ కప్‌ను కెరీర్ చివరి దశలో ఉన్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈసారైనా అందిస్తారో లేదో చూడాలి. మెగా ఈవెంట్‌లో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూప్‌లో 10 టీమ్స్ పోటీపడతాయి. గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుతాయి. ఇందులో నెగ్గిన టీమ్స్ ఫైనల్స్ ఆడతాయి. పపువా న్యూగినియా, స్కాట్లాండ్, బెర్ముడా, నమీబియా వంటి చిన్న జట్లు ఈసారి మెగా టోర్నీకి అర్హత సాధించాయి. ఇక సెప్టెంబర్, అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లో విమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించిన డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.
పారాలింపిక్స్ (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8)
వికలాంగ అథ్లెట్ల కోసం చిన్నగా మొదలుపెట్టిన పారాలింపిక్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. దాదాపుగా ఒలింపిక్స్‌లో పోటీపడే ప్రతి కంట్రీ నుంచి క్రీడాకారులు ఇందులో బరిలోకి దిగుతున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు (5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్) సాధించిన ఇండియా ఈసారి మరిన్ని ఎక్కువ మెడల్స్‌పై ఫోకస్ పెట్టింది.
వింటర్ యూత్ ఒలింపిక్స్ (జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు)
వరల్డ్ యూత్ గేమ్స్ ప్లేస్‌లో తీసుకొచ్చిన వింటర్ యూత్ ఒలింపిక్స్ నాలుగేళ్లకు ఓసారి జరుగుతాయి. ఈసారి జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఈ పోటీల్లో 14 నుంచి 18 ఏళ్ల ఏజ్ గ్రూప్ అథ్లెట్లు బరిలోకి దిగుతారు. ఒలింపిక్స్‌లో ఉండే క్రీడాంశాలే ఇందులోనూ ఉండటంతో వరల్డ్ వైడ్ యంగ్ అథ్లెట్లు ఇందులో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో రాణిస్తే ఒలింపిక్స్‌కు వెళ్లడం ఈజీగా ఉంటుంది. ఈసారి బీచ్ హ్యాండ్‌బాల్‌ను కొత్తగా తీసుకొచ్చారు.