ఉద్యోగులకు ఊరట కొంచమే

ఉద్యోగులకు ఊరట కొంచమే
  •  స్టాండర్డ్​ డిడక్షన్​ రూ.25 వేలు పెంపు.. రెండు స్లాబుల్లో మార్పులు

న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర బడ్జెట్​వేతన జీవికి స్వల్ప ఊరటే కల్పించింది.  పన్ను స్లాబుల్లో, స్టాండర్డ్​ డిడక్షన్లలో మార్పులు చేసినా ప్రయోజనాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. స్టాండర్డ్ ​డిడక్షన్​ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. దీనివల్ల రూ.17,500 ఆదా చేయవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఇక నుంచి రూ.7.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లు పన్ను కట్టాల్సిన అవసరం లేదని  అన్నారు. కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్​గా మార్చారు. దీనిలోకి మారిన వారికి మాత్రమే తాజా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులూ ప్రకటించలేదు.   

కొత్త పన్ను స్లాబులు ఈ ఏడాది ఎప్రిల్​ నుంచి అమల్లోకి వస్తాయి.  అయితే  కొత్త పన్ను విధానంలో మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50వేల నుంచి రూ.75వేలకి పెంచారు. కుటుంబ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రస్తుతం రూ.15వేల నుంచి రూ.25వేలకి పెంచారు. అయితే కొత్త పన్ను స్లాబులు 2025‌‌‌‌‌‌‌‌–26 అసెస్​మెంట్​ ఇయర్​కు వర్తిస్తాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పాత విధానంలో రూ.3లక్షలు –-- రూ.6లక్షలు  స్లాబును రూ.3లక్షలు -–- రూ.7లక్షలకు పెంచారు. పన్ను మాత్రం మారలేదు. రూ.6‌‌‌‌‌‌‌‌–9 లక్షల స్లాబుకు 10 శాతం పన్ను ఉండేది. దీనిని రూ.7–10 లక్షలకు పెంచారు. అంటే రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్లకు పదిశాతం పన్ను వర్తిస్తుంది. 

క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్సుల్లో మార్పులు 


క్యాపిటల్​ గెయిన్స్​ను సరళీకృతం చేసే ఉద్దేశ్యంతో అన్ని ఆర్థిక,  ఆర్థికేతర ఆస్తులలో స్వల్పకాలిక క్యాపిటల్​గెయిన్స్​ (ఎస్టీసీజీ) పన్నులను,  దీర్ఘకాలిక  క్యాపిటల్ ​గెయిన్స్​ (ఎల్టీసీజీ) రేట్లను మంత్రి నిర్మల మార్చారు. లిస్టెడ్​ ఆర్థిక ఆస్తులను సంవత్సరం కంటే తక్కువ కాలం ఉంచుకుంటే స్వల్పకాలిక క్యాపిటల్​గెయిన్స్​ అంటారు. సంవత్సరానికి మించితే దీర్ఘకాలికంగా పేర్కొంటారు. రెండేళ్లకు మించి అన్​లిస్టెడ్​,  నాన్-ఫైనాన్షియల్ ఆస్తులు ఉంటే  ఎల్టీసీజీ పన్నును చెల్లించాలి. కొన్ని నిర్దేశిత ఆస్తులపై క్యాపిటల్​ గెయిన్స్​ ట్యాక్సును 20 శాతం వసూలు చేస్తారు. మిగతా  అన్ని ఆర్థిక,  ఆర్థికేతర ఆస్తులకు ఎల్టీసీజీ పన్ను 12.5 శాతం ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలపై పన్నులు మారవు. ఇక నుంచి అన్​లిస్టెడ్​బాండ్లకు, డిబెంచర్లకు పన్ను ఉంటుంది.  ఎంప్లాయీ స్టాక్​ ఆప్షన్స్​, విదేశాలలో బ్యాంకు లేదా పెన్షన్ ఆస్తులను కలిగి ఉన్న బహుళజాతి కంపెనీల ఉద్యోగులు ఇక నుంచి ఈ ఆస్తులను బహిర్గతం చేయనందుకు జరిమానా ఉండదు. అయితే వాటి విలువ రూ. 20 లక్షలకు మించకూడదు.

ALSO READ : ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు మెడికల్ టెస్టులు : ఎండీ సజ్జనార్  

ఇక నుంచి కొత్త పన్ను విధానమే

కొత్త పన్ను విధానం ఇక నుంచి డిఫాల్ట్ పన్ను విధానం అవుతుంది.  పన్ను చెల్లింపుదారు ప్రత్యేకంగా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. లేకుంటే ఒక వ్యక్తి  పన్ను బాధ్యత కొత్త పన్ను విధానం ఆధారంగా లెక్కిస్తారు. పాత పన్ను విధానంలో పన్ను చెల్లించడానికి, ఒక వ్యక్తి దానిని ప్రత్యేకంగా ఎంచుకోవాలి. పాత పన్ను విధానం పలు తగ్గింపులను,  మినహాయింపులను అందిస్తుంది. అయితే కొత్త పన్ను విధానం చాలా తక్కువ అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో కింది లాభాలు ఉంటాయి.
ఎ) మొత్తం ఐదు ఆదాయపు పన్ను స్లాబులు ఉంటాయి. రూ.15 లక్షలకు మించిన ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను వర్తిస్తుంది
బి) ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. మూడు లక్షలు. అంటే రూ.మూడు లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
సి) రూ. ఏడు లక్షలు మించని ఆదాయానికి  పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 87ఏ ప్రకారం రూ. 25వేల వరకు పన్ను రాయితీ వర్తించడమే ఇందుకు కారణం.
డి) ఎంప్లాయీస్​,  పెన్షనర్లకు రూ. 50వేల స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది. కుటుంబ పెన్షనర్లు కూడా రూ. 15 వేల స్టాండర్డ్ డిడక్షన్​ను క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులు.
ఇ) రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై 25శాతం సర్‌‌‌‌ఛార్జ్ విధిస్తారు. 
ఎఫ్) రూ. ఏడు లక్షల కంటే కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు మార్జినల్​ ట్యాక్స్​ నుంచి మినహాయింపు ఉంటుంది. 
జీ) ఆదాయపు పన్ను మొత్తంపై 4శాతం సెస్ విధిస్తారు. రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిపై సర్‌‌‌‌చార్జీలు విధిస్తారు. కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1, 2020న మొదలయింది.

స్టార్టప్‌‌‌‌లపై ఏంజెల్ పన్ను రద్దు  

 స్టార్టప్‌‌‌‌లకు పెద్ద ఉపశమనం ఇస్తూ, దేశంలోని వర్ధమాన పారిశ్రామికవేత్తల వృద్ధిని మరింత ప్రోత్సహించడానికి అన్ని తరగతుల పెట్టుబడిదారులకు ఏంజెల్ పన్నును తొలగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.  అన్‌‌‌‌లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్‌‌‌‌ల వాల్యుయేషన్​ కంపెనీ ఫెయిర్​ మార్కెట్ విలువను మించి ఉంటే, వాటి ద్వారా సేకరించిన నిధులపై ప్రభుత్వం విధించే ఆదాయపు పన్నును ఏంజెల్ ట్యాక్స్ అని పిలుస్తారు. దీనివల్ల భారత స్టార్టప్ ఎకో-సిస్టమ్‌‌‌‌ను బలోపేతం అవుతుందని,  ఆవిష్కరణలకు మద్దతు దొరుకుతుందని మంత్రి నిర్మల అన్నారు. 

రియల్ ఎస్టేట్​కు నిరాశే

ఈ బడ్జెట్​ రియల్​ ఎస్టేట్​కు నిరాశ కలిగించింది. ట్రాన్సాక్షన్లపై పన్ను భారం పెరిగింది.  ఆస్తుల అమ్మకంపై లాంగ్​టర్మ్​ గెయిన్స్​ను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించినా,  రియల్​ ఎస్టేట్​ఇండెక్సేషన్​ ప్రయోజనాన్ని  రద్దు చేశారు. దీనివల్ల ప్రాపర్టీలు అమ్మితే 12.5 శాతం ట్యాక్స్​ కట్టాలి.  ఆస్తి ధర పెరుగుదల వల్ల కలిగే పన్ను భారాన్ని తగ్గించే  పన్ను నిబంధనను ఇండెక్సేషన్​ అంటారు.  గతంలో మూడేళ్ల కంటే ఎక్కువ సమయం గల ప్రాపర్టీపై మాత్రమే లాంగ్​టర్మ్​ గెయిన్స్​ ట్యాక్స్​ ఉండేది. ఇప్పుడు దానిని రెండేళ్లకు తగ్గించారు. రూ. 50 లక్షలు  అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి అమ్మకంపై ఒక శాతం టీడీఎస్ విధించారు.   లావాదేవీలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ పన్ను వర్తిస్తుంది. ఈ నిర్ణయాలపై రియల్టీ ఎక్స్​పర్టులు పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీఎస్​లో మార్పులు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయి.  

మరికొన్ని ట్యాక్సుల్లో మార్పులు

ఫారిన్ ​కంపెనీలపై విధించే కార్పొరేట్​ ట్యాక్సును 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించారు. ఈ–కామర్స్​ కంపెనీలపై విధించే టీడీఎస్​ 0.1 శాతం నుంచి ఒక శాతానికి పెంచారు. విదేశీ ఈ–-కామర్స్ సరఫరాలపై 2 శాతం ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్నును తొలగించారు. షేర్ల బైబ్యాక్​పైన ఇక నుంచి కంపెనీకి బదులు ఇన్వెస్టర్​ పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది. ఫ్యూచర్స్​ అండ్​ ఆప్షన్​పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్​ ట్యాక్స్​ను 0.1 నుంచి 0.1 శాతానికి పెంచారు.