పుతిన్ ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ యువకులు

  •  బ్రోకర్ల మాయలో పడి మోసపోయిన 12 మంది యువకులు
  • రష్యాకు వెళ్లాక ఆర్మీలో చేర్చిన ఏజెంట్లు
  • వాళ్లను ఉక్రెయిన్​పై యుద్ధానికి వినియోగిస్తున్న రష్యా

న్యూఢిల్లీ: రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల ట్రాప్​లో పడి 12 మంది ఇండియన్ యువకుల జీవితాలు డేంజర్ జోన్​లో పడ్డాయి. ఉక్రెయిన్​పై యుద్ధం చేసేందుకు రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీలో చేర్చడంతో ప్రస్తుతం ఆ యువకులు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. తమను ఎలాగోలా ఇక్కడినుంచి బయటపడేయండంటూ కుటుంబసభ్యులకు వీడియో మెసేజ్​లు పంపడంతో ఈ విషయం బయటపడింది.

బాధితుల్లో తెలంగాణకు చెందినవాళ్లు ఇద్దరు ఉన్నారు. మాస్కోలోని షాపింగ్​ మాల్స్​లో సెక్యూరిటీ గార్డుగా, హెల్పర్లుగా ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి తమను మోసం చేశారని యువకులు వీడియోలో వెల్లడించారు. తమను పుతిన్ ప్రైవేట్ ఆర్మీలో వదిలేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

నమ్మించి మోసం చేసిన్రు.. 

బాబా వ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఫైసల్ ఖాన్ అలియాస్ బాబాకు 3 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్​లో ఉన్న ఇతడు తన వీడియోల ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగాలంటూ యువకులకు ఎర వేశాడు. దీంతో మనోళ్లు అతడిని సంప్రదించగా కాంట్రాక్ట్ పద్ధతిన రష్యాలో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. మాస్కోలో ఉన్న తన ఏజెంట్లు రమేశ్, మోయిన్ ను సంప్రదించాలని పంపించాడు.

దీంతో బాధితులు గతేడాది డిసెంబర్​లో మాస్కోకు వెళ్లి ఏజెంట్లను సంప్రదించగా వాళ్లు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగమని చెప్పి ఏవో పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. విధుల్లో భాగమని గన్ ఫైరింగ్ లో ట్రైనింగ్ ఇప్పించారు. అనంతరం ఉక్రెయిన్ బార్డర్​లో వదిలేశారు. దాంతో తాము చేసిన సంతకం పుతిన్ ప్రైవేట్ ఆర్మీలో ఏడాది పనిచేయడానికని తెలిసిందన్నారు.

వాపస్ తీసుకురాలని ఒవైసీ లేఖ

బాధితుల కుటుంబ సభ్యులు తనను సంప్రదించడంతో  ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ కేంద్రానికి, విదేశాంగ మంత్రి జైశంకర్​కు లేఖ రాశారు. దాదాపు 12 మంది మన దేశ యువకులు రష్యన్ ఆర్మీ చేతిలో పడ్డారని, వాళ్లని వాపస్ తీసుకురావాలని కోరారు. వారిలో తెలంగాణ యువకులు ఇద్దరు, కలబుర్గికి చెందిన ఇద్దరు, గుజరాత్‌‌కు చెందిన ముగ్గురు, కాశ్మీరీలు ఇద్దరు, యూపీ యువకుడు ఒకరు ఉన్నారని ఒవైసీ తెలిపారు.

స్పందించిన కేంద్రం

రష్యన్ ఆర్మీలో చిక్కుకుపోయిన మనోళ్లను వాపస్ తీసుకువచ్చేందుకు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది ఇండియన్ యువకులు వాళ్లకు తెలియకుండానే రష్యా సైన్యంలో చేరినట్లు మాకు సమాచారం అందింది. వీలైనంత తొందరగా ఆ యువకులను కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని రష్యన్ అధికారులతో ఇండియన్ ఎంబసీ చర్చలు జరుపుతోంది. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి” అని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.