అంపశయ్యపై చెంచులు..పదేండ్ల క్రితం 12వేల జనాభా.. ప్రస్తుతం 9వేలకు!

అంపశయ్యపై చెంచులు..పదేండ్ల క్రితం 12వేల జనాభా.. ప్రస్తుతం 9వేలకు!
  •     ఉపాధి లేక, అర్ధాకలితో బతుకీడుస్తున్నరు
  •     పోషకాహారం లేక ప్రాణాలిడుస్తున్నరు
  •     ఇలాగే ఉంటే చెంచు జాతి కనుమరుగు
  •     ఐటీడీఏ ఉన్నా లేనట్లే

అమ్రాబాద్, వెలుగు: అడవినే నమ్ముకుని బతుకుతున్న చెంచుల జీవితాలు మారడం లేదు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, ఫారెస్ట్​ ఆఫీసర్ల ఆంక్షలు చెంచుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉపాధి లేక, సరైన పోషకాహారం అందక జనాభా వేగంగా తగ్గిపోతోంది. పదేండ్ల కింద 12 వేల జనాభా ఉండగా, ప్రస్తుతం 9 వేలకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెంచులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఐటీడీఏ ఉన్నా లేనట్లే..

ఉమ్మడి రాష్ట్రంలో సున్నిపెంట ఐటీడీఏ పరిధిలో చెంచుల సమస్యలపై ప్రతి నెలా మీటింగ్​లు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మన్ననూర్  వద్ద ఏర్పాటు చేసిన ఐటీడీఏకు పదేండ్లుగా రెగ్యులర్  పీవోను కూడా నియమించలేదు. చెంచు మహా సమాఖ్యల ఆధ్వర్యంలో మహాసభలు జరిగేవి.  

ఆరేండ్లుగా అవి కూడా నిలిచిపోయాయి. మహిళా సంఘాలను సాధారణ సమాఖ్యలతో అనుసంధానం చేసి చేతులు దులుపుకున్నారు. ఐటీడీఏకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని గిరిజనులు వాపోతున్నారు. అంతరించిపోతున్న అరుదైన అడవి తెగగా గుర్తించిన చెంచులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అక్కడక్కడ సీసీ రోడ్లు, ఈజీఎస్​ కింద కొంత పని కల్పిస్తున్నారు. కొన్ని పెంటల్లో చెంచులు తాగునీటి కోసం చెలిమల మీదే ఆధారపడాల్సి వస్తోంది. సోలార్​ పంపులు, మోటార్లు పెడతామంటూ మూడేండ్ల నుంచి అధికారులు చెబుతున్నా పనులు ముందుపడడం లేదు. 

వేగంగా తగ్గుతున్న జనాభా..

మన్ననూర్​ ఐటీడీఏ పరిధిలో నాగర్​ కర్నూల్,​ మహబూబ్​నగర్​ జిల్లాల్లోని 12 మండలాల్లో 108 చెంచుపెంటలున్నాయి. 3,200 గుడిసెలు, ఇండ్లలో 9,400 మంది చెంచులు నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, సకాలంలో వైద్యం అందక చెంచు పెంటల్లో జననాల రేట్​ కంటే మరణాల రేట్​ ఎక్కువగా ఉంటోంది. పదేండ్లలో ఏకంగా 25 శాతం మేర జనాభా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అటవీ ఉత్పత్తులు తగ్గడం, జీవనోపాధి లేక సరైన పౌష్టికాహారం అందక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉపాధి దొరికినా మద్యానికి బానిసై ఆడ, మగా తేడా లేకుండా చిన్న వయసులో చనిపోతున్నారు. పోషకాహారం అందక బాలింతలు, గర్భవతులు, చిన్నారులు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వైద్యం అందకపోవడం చెంచుల పాలిట శాపంగా మారుతోంది.

ఉపాధి కల్పిస్తేనే మనుగడ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులు నివసించే ప్రాంతాల్లోనే ఉపాధి కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాలని కోరుతున్నారు. అడవినే నమ్ముకుని బతికే చెంచులకు అటవీ శాఖలో ఉద్యోగావకాశాలు కల్పిస్తే మార్పు వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.