ఇటుక బట్టీల్లో కార్మికులతో వెట్టి చాకిరి .. చోద్యం చూస్తున్న అధికారులు

  • పని స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు
  • ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే

పెద్దపల్లి, వెలుగు: ఇటుక బట్టీల్లో కార్మికుల బతుకులు బానిసల్లా మారిపోయాయి. ఒడిసా నుంచి కార్మికులను  తీసుకొచ్చి ఇక్కడ  చాకిరీ చేయిస్తున్నారు. బట్టీల్లో కార్మికులను నానా హింసలకు గురవుతున్నారు.   ఎదురు తిరిగి ప్రశ్నించే అవకాశాలు లేవు. ఎంత ఇబ్బంది  ఉన్నా బట్టీల్లో చేరిన తర్వాత అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి లేకుండా యజమానులు కట్టుదిట్టాలు చేసుకున్నారు.  కష్టమైనా భరించి సీజన్​ పూర్తయ్యే వరకు పనులు చేసేలా యజమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్మిక చట్టాలు ఇటుక బట్టీ కార్మికులకు వర్తించడం లేదు. వలస కార్మిక చట్టాల ప్రకారం యజమానులు కార్మికులకు నివాసం, తిండి, వారి పిల్లలకు చదువులు ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. 

కానీ  కనీస అవసరాలు కూడా కల్పించడం లేదు.   ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని ఇటుక బట్టీలో కార్మికులను కొట్టిన సంఘటన, పెద్దపల్లి మండలంలోని ఇటుక బట్టీలో కల్తీ ఆహారం తిని దాదాపు 20 మంది వరకు అస్వస్థతకు గురికాగా అందులో ఇద్దరు చనిపోయిన సంఘటనలు కార్మికుల దురవస్థను తెలుపుతున్నాయి, ఇలాంటి సంఘటన పట్ల సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జరుగుతున్న సంఘటనలపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు  ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.

రూల్స్​కు విరుద్దంగా బట్టీలు...

పెద్దపల్లి జిల్లాలో దాదాపు 130 వరకు ఇటుక బట్టీలు  నడుస్తున్నాయి. అందులో చాలా బట్టీలు నిబంధనలకు విరుద్దంగానే ఉన్నాయి. పెద్దపల్లి నుంచి హైదరాబాద్​ వరకు ఇటుకలు రవాణా జరుగుతుంది. ఇటుకలకు కావాల్సిన నాణ్యమైన మట్టీ, ఎన్టీపీసీ బూడిద అందుబాటులో ఉండటంతో, ఇటుక బట్టీలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పదులలో ఉన్న ఇటుకబట్టీలు గడిచిన పదేళ్లలో వందల సంఖ్యలోకి పోయాయి.  

ప్రస్తుతం నడుస్తున్న ఇటుక బట్టీలు చాలా మంది రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో ఇటుక బట్టీల్లో జరుగుతున్న  అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.  కార్మికులను నమ్మించి ఇతర రాష్ట్రాలైన ఒడిస్సా, బీహార్​ నుంచి తీసుకొస్తున్న ఇటుక బట్టీల యజమానులు వారి కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అక్కడక్కడ మైనర్లతో కూడా పనులు చేయిస్తున్నారు. ఉండటానికి సరైన ఇండ్లు, తాగునీరు, మంచి తిండి ఏర్పాటు చేయడం లేదు. పని స్థలాలు భయంకరంగా ఉంటున్నాయి. 

 కార్మికులకు వైద్య సహాయం లేదు, ఆరోగ్యం చెడిపోతే స్థానికంగా ఉన్న ఆర్​ఎంపీలతో నామమాత్రపు ట్రీట్​మెంట్​ చేయిస్తున్నారు. ప్రమాదవశాత్తు చనిపోతున్న కార్మికులకు ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. మహిళా కార్మికులపై గతంలో పలు అఘాయిత్యాలు జరిగినా, బెదిరించి కార్మికుల నోరు మూయించారనే ఆరోపణలున్నాయి.

డెన్నులుగా మారిన బట్టీలు...

ఇటుక బట్టీలు డెన్నులుగా మారిపోయాయి. ఇటుక బట్టీల్లో చేరిన కార్మికులు అక్కడ నుంచి బయట పడే చాన్స్​ లేదు. వలస కార్మిక చట్టాల ప్రకారం కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి పిల్లలకు చదువు చెప్పించాలి, కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఇటుక బట్టీల యజమానులలు కార్మికులకు మాయ మాటలు చెప్పి ఒరిస్సా, బీహార్​ లాంటి రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు చేతిలో రూపాయి లేకుండా కట్టు బట్టలతో వస్తున్నారు.  కష్టపడి పనిచేసినా ఇష్టమైన తిండి తినలేకపోతున్నారు.  వారం వారం యజమానుల ముందు చేయిచాసి అడుక్కునే పరిస్థితే ఉంది. నాణ్యమైన తిండి, తాగడానికి స్వచ్చమైన నీరు లేదు. దీంతో కార్మికులు, వారి పిల్లలు నిత్యం అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్న పిల్లలు తల్లితండ్రులతో పని స్థలాల్లో తిరుగుతుండటంతో  చాలా సార్లు ట్రాక్టర్లు, లారీల కింద పడి నలిగిపోయిన సంఘటనలలున్నాయి. అయినా బట్టీల యజమానులపై ఎలాంటి చర్యలు లేవు.  

ఆఫీసర్ల పర్యవేక్షణ లేదు

పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో అరాచకం పెరిగిపోయింది. బట్టీలకు నిబంధనలు లేవు, కార్మికులపై అఘాయిత్యాలు పెరిగిపోయినయి. వలస కార్మిక చట్టం అమలు చేయడం లేదు. బట్టీలపై సంబంధిత శాఖల అధికారుల  పర్యవేక్షణ లేకపోవడంతో ఇటుక బట్టీల్లో అక్రమాలు పెరిగినయి, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి.

ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ, జిల్లా కార్యదర్శి, పెద్దపల్లి