
US Vs China: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. తమ అణు ఒప్పందానికి ఓకే చెప్పకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని, కఠినమైన ఆంక్షలను అమలులోకి తీసుకొస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన మెుదటి టర్మ్ సీన్ రిపీట్ అవుతుందని ట్రంప్ తేల్చి చెప్పారు. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు షెజెస్కియాన్ ఏం చేసుకోవచ్చని అన్నారు. ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం దిశగా దారితీసే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే యుద్ధం పరోక్షంగా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే ట్రంప్ పలుమార్పు తానే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపుతున్నాననే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ అసలు వరల్డ్ వార్-3 రావటానికి నిజంగా ఛాన్స్ ఉందా అంటే నిజమేననే జవాబు వినిపిస్తోంది. అవును 'లివింగ్ నోస్ట్రాడమస్' అని తననుతాను ప్రకటించుకున్న బ్రెజిల్ కి చెందిన మానసిక నిపుణుడు అథోస్ సలోమ్ మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇటీవలి పరిణామాలు యుద్ధానికి ప్రేరేపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇతన కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి ముందుగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జనవరిలో లాట్వియా-స్వీడన్ దేశాల మధ్య సముద్రంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దెబ్బతినటాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. దీనిపై స్వీడన్ దర్యాప్తును ప్రారంభించింది. అలాగే డిసెంబర్‌లో జరిగిన మరో సంఘటనలో ఫిన్నిష్-ఎస్టోనియన్ ఎస్ట్‌లింక్ రెండు విద్యుత్ లైన్, టెలికాం కేబుల్‌లను దెబ్బతీసినట్లు అనుమానిస్తున్న రష్యన్ ఆయిల్ ట్యాంకర్‌ను ఫిన్నిష్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితులు పరోక్షంగా బాల్టిక్ సముద్ర జలాల్లో దేశాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధాన్ని సూచిస్తోందని అథోస్ సలోమ్ పేర్కొన్నారు.
Also Read:-మయన్మార్ భూకంపం పవర్ ఎంతంటే.. 334 అణుబాంబులేస్తే వచ్చేంత శక్తి !
ఫిన్లాండ్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించిన 2023 కేబుల్ నెట్‌వర్క్ వైఫల్యాన్ని కూడా ఈ సందర్భంగా సలోమ్ ఈ సందర్భంగా ప్రస్థావించారు. వాస్తవానికి ఈ సంఘటనలు నాటో భద్రతను పెంచడానికి దారితీశాయని, కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడటానికి అత్యవసర ప్రోటోకాల్‌లను రూపొందించడానికి యూరోపియన్ యూనియన్‌ను ప్రేరేపించాయన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతపై ఇలాంటి చర్యలు భారీ అంతరాయాలను కలిగిస్తాయని సూచించారు. సముద్ర గర్భంలో వివిధ దేశాల మధ్య ఉండే ఫైబల్ కేబుల్స్ ఆధునిక కాలంలో కీలకంగా మారాయి. ఒకవేళ ఇవి పనిచేయటం మానేసినా లేదా ఏవైనా అంతరాయాలు వీటికి కలిగించినా అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద బ్లాకౌట్ కి దారితీస్తుంది. వీటి వల్ల మిలిటరీ వ్యవస్థలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది.
ఒక్కసారి గతంలోని ప్రపంచ యుద్ధాలకు కారణంగా ఉన్న వివిధ అంశాలను పరిశీలిస్తే.. మొదటి ప్రపంచ యుద్ధం ఒక ఆర్చ్‌డ్యూక్ హత్య ద్వారా ప్రేరేపించబడగా.. రెండవది పోలాండ్ దండయాత్ర వల్ల స్టార్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధానికి దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా మారవచ్చని తెలుస్తోంది. అలాగే అమెరికా-చైనాల మధ్య భవిష్యత్తులో సంఘర్షణలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న సాంకేతిక యుగంలో ఒక ఇంటర్నెట్ కేబుల్ నాశనం పెద్ద సైనిక దాడి మాదిరిగా వినాశకరమైన ప్రభావాన్ని చూపించవచ్చని సలోమ్ అంటున్నారు. బాల్టిక్ సంఘటనలు విధ్వంసక చర్యలుగా నిర్ధారించబడితే ప్రపంచ శక్తులు ఎలా స్పందిస్తాయనే దానిపై సలోమ్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.