వయసు మళ్లిన క్రికెటర్లు కదా..! లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఏం మజా అంటది అనుకోకండి.. వెటరన్ ప్లేయర్లు అందరూ గ్రౌండ్ లో హోరాహోరీగా తలపడుతున్నారు. కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‍లలో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సంధర్భాల్లో సహచర ఆటగాళ్లపై కోపతాపాలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా, అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. భారత మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఏం జరిగిందంటే..?
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా అర్బన్ రైజర్స్ హైదరాబాద్, భిల్వారా కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ తోటి ఆటగాడు ఇక్బాల్ ఇబ్దుల్లా మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింగిల్ తీయడానికి నిరాకరించాడనే కారణంతో అతనిపై నోరు పారేసుకున్నాడు. భిల్వారా కింగ్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
14వ ఓవర్‌లో నాలుగో బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు ఆడిన పఠాన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. సగం దూరం పరుగెత్తాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఇక్బాల్ అబ్దుల్లా స్పందించలేదు. సింగిల్ రాదు అన్నట్లుగా మిన్నకుండిపోయాడు. దీంతో యూసఫ్ పఠాన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏం చేస్తున్నావ్ అంటూ గట్టిగా అరిచేశాడు. ఆ కోపంలో పఠాన్ మరుసటి బంతిని సిక్స్ గా మలిచాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Yusuf Pathan converts anger into power ?
— ESPNcricinfo (@ESPNcricinfo) December 1, 2023
(via @llct20) | #LLCT20 | #LLCOnStar pic.twitter.com/3I49dYzRPV
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, భిల్వారా కింగ్స్ పై అర్బన్ రైజర్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భిల్వారా కింగ్స్ 144 పరుగులు చేయగా.. అర్బన్ రైజర్స్ మరో 15 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది.