క్రాప్ ​లోన్ల​ మాఫీ ఆలస్యంతో రైతన్నలపై మిత్తిల  భారం 

ప్రభుత్వం రుణమాఫీని ఏకకాలంలో క్లియర్​చేయకపోవడంతో అన్నదాతలపై వడ్డీభారం పెరుగుతోంది. క్రాప్​లోన్​మాఫీకి రూ. 25,936 కోట్లు ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు రూ.3,117 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు అప్పు ఉందనే కారణం చూపుతూ బ్యాంకులు కొత్తగా లోన్లు ఇస్తలేవు. ఈ ఏడాది రూ. 53,222 కోట్లు పంట రుణాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ.. ఇప్పటి వరకు మంజూరు చేసిన లోన్ల మొత్తం 20 వేల కోట్లకు మించలేదు. ఏకకాలంలో లోన్​మాఫీ గాక.. కొత్త అప్పు దొరకక.. రైతులు మైక్రోఫైనాన్స్ ​సంస్థల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. వర్షాలకు, పంటలు దెబ్బతిన్న సందర్భాల్లో అసలు, వడ్డీ చెల్లించ లేక సూసైడ్ ​చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో లోన్​మాఫీ చేసి రైతుల ఆత్మహత్యలను ఆపాలి. 

రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది.  రూ.50 వేల లోపు లోన్ ​ఉన్నవారి మాఫీ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది. బ్యాంకులో క్రాప్​లోన్​ఉన్న 40 లక్షల మంది రైతుల్లో రూ.50 వేల లోపు లోన్​ ఉన్న వారి సంఖ్య కేవలం 9 లక్షలే. రుణామాఫీకి సర్కారు ప్రకటించిన రూ. 25,936 కోట్లలో ఇప్పటి వరకు కేటాయించింది రూ.3,117 కోట్లే. లోన్​మాఫీ ఏకకాలంలో జరగకపోగా.. ప్రస్తుతం నెమ్మదిగా సాగుతుండటంతో బ్యాంకులు వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ వేస్తూనే ఉన్నాయి. 2014లో లక్ష రూపాయల లోపు పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ.16, 124.38 కోట్లు కేటాయించింది. 35 లక్షల మంది రైతులకు 4 విడతలుగా మాఫీ జరిగింది. తీసుకున్న లోన్ల మొత్తానికి రూ.9,812 కోట్ల వడ్డీ పడగా ఆ భారాన్ని రైతులే భరించారు. ప్రస్తుతం రూ.50 వేల పైన బాకీ ఉన్న రైతులకు 4 విడతలుగా మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల కనీసం రూ.15 వేల కోట్ల వడ్డీ భారం రైతులపై పడే అవకాశం ఉంది. బ్యాంకులో అప్పు ఉన్న కారణంగా రైతులకు మళ్లీ లోన్ అందడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు దాదాపు రూ.20 వేల కోట్ల మేర అధిక వడ్డీకి ప్రైవేట్ లోన్లు తీసుకుంటున్నట్లు అంచనా. ఒకవేళ ప్రకృతి విపత్తులతో పంట దెబ్బతింటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బాకీ తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 63 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాంకులు 40.66 లక్షల మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చాయి. అవి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వలేదు. ఎంతో కొంత రుణం ఇచ్చి, లోన్​ఇచ్చినట్లు ప్రకటించుకుంటున్నాయి. మిగిలిన 22.34 లక్షల మందికి బ్యాంకులు లోన్లు ఇయ్యలేదు. 70 ఏండ్లుగా 22 లక్షల మంది రైతులు బ్యాంకు గడప తొక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరికి లోన్​ ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేకున్నా కొత్తవారికి రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు చెప్తున్నాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయాన్ని చర్చించడానికి రైతు సంఘాలు ఎజెండా ప్రతిపాదించినప్పటికీ మంత్రులు, బ్యాంకులు, ఈ ఎజెండాపై చర్చించలేదు. రిజర్వుబ్యాంకు ఆదేశాల ప్రకారం ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఏటా100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. దాని ప్రకారం రాష్ట్రంలో 5,320 బ్రాంచీలు సుమారు 5 లక్షల మందికి ఏటా లోన్లు ఇవ్వొచ్చు. ఆ విధంగా చేసినా నాలుగేండ్లలో రాష్ట్రంలోని రైతులందరికీ లోన్లు అంది ఉండేవి. 
సగం లోన్లు కూడా..  
2020-–21 వార్షిక సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లకు రూ. 53,222 కోట్ల పంట రుణాలు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కానీ మంజూరు చేసిన లోన్లు 20 వేల కోట్లకు మించలేదు. అదీ 45 లక్షల మంది రైతులకే. మరో 10–-15 వేల కోట్లు బుక్ అడ్జెస్ట్​మెంట్​ద్వారా రుణం ఇచ్చిన్నట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.12,061 కోట్లు ఇస్తున్నట్లు ప్రణాళికలో ప్రకటించారు. భారీ యంత్రాల కొనుగోలుకు తప్ప సన్న, చిన్నకారు రైతులకు పంపుసెట్లు, బోర్లు, పైపులైన్లు, పశువుల కొనుగోలుకు దీర్ఘకాలిక రుణాలు ఇయ్యలేదు. రాష్ట్ర బ్యాంకులు తమ వ్యాపార ధనంలో18% పంట రుణాలకు, 22% లాంగ్​టర్మ్​రుణాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విధిగా లోన్లు ఇవ్వాలి. దీని ప్రకారం చూస్తే.. రాష్ట్ర బ్యాంకుల్లో 5 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అంటే అందులో 92 వేల కోట్లు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. అటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు చేయకపోగా, ఇటు రిజర్వు బ్యాంకు ఆదేశాలు కూడా పాటించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించని బ్యాంకర్లు.. రుణ పద్ధతులను మార్చుకుంటూ బ్యాంకులకు ఎగనామం పెట్టే పారిశ్రామిక వేత్తలకు మాత్రమే లోన్లు ఇస్తున్నారు. అలా బ్యాంకులు ఇచ్చిన లోన్లు ఎక్కువగా  ‘ఎన్ పీఏ’ గా మారి చివరికి బ్యాంకులే దివాళా తీసే స్థితికి కారణమవుతోంది. 
మైక్రోఫైనాన్స్​సంస్థలు
తక్కువ వడ్డీకే ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తున్న బ్యాంకులు, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలకు ఎక్కువ వడ్డీకి లోన్లు ఇస్తున్నాయి. కొన్ని గుత్త సంస్థలు 7 నుంచి 9 శాతానికి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని 22- నుంచి 23 శాతానికి మైక్రో ఫైనాన్స్ పేరుతో రైతులకు అప్పులు ఇస్తున్నాయి. పంట పండినా, ఎండినా బలవంతంగా అప్పులు వసూలు చేస్తున్నాయి. 24 శాతం వడ్డీ అంటే నూటికి నెలకు 2 రూపాయలు అవుతుంది. నాలుగేండ్లలో అసలుకు సమానంగా వడ్డీ పెరుగుతుంది. ఇలా  వడ్డీ చక్రబంధనంలో రైతు ఇరుక్కుంటున్నాడు. బ్యాంకులు కూడా రైతుల అప్పులపై ప్రతి 6 మాసాలకు ఒకసారీ వడ్డీని అసలులో కలపడం వల్ల చక్రవడ్డీ పెరిగిపోతోంది. ఈ వడ్డీ భారాల నుంచి బయట పడటానికి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలంగాణలో అధ్వానంగా పనిచేస్తోంది. ఈ కమిటీ నాలుగేండ్లలో కనీసం 4 సార్లు కూడా సమావేశం కాలేదు. ఏప్రిల్, మే నెలల్లో మీటింగ్ ​పెట్టి రుణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నిర్దేశించిన వారికి లోన్లు ఇస్తున్న విధానంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కి లాంటి దేశాలు మనకన్నా ముందున్నాయి. అమెరికాలో వ్యవసాయ రుణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక్కడ మాత్రం ఏ దేశ విధానాలూ అమలు జరగడం లేదు. 1968లో బ్యాంకుల నేషనలైజేషన్​ తరువాత రైతులందరికీ వ్యవసాయ రుణాలు ఇచ్చారు. 
అప్పటి నుంచి 2000 వరకు బ్యాంకులు రైతులకు తగినన్ని రుణాలు ఇచ్చాయి. కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగినప్పటికీ 2014 నుంచి వ్యవసాయ రుణాల మంజూరును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. అందుకే స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయి, ఇతర దేశాల దిగుమతులు పెరుగుతున్నాయి.  ఏటా 3 లక్షల కోట్ల విలువ గల వ్యవసాయోత్పత్తులను(నూనెలు, చక్కెర, పప్పులు, పత్తి, ముతక ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు) దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ రుణ వ్యవస్థను సరి చేసి రైతులందరికీ సకాలంలో రుణాలు ఇప్పించాలి. 
పంటల బీమాకు నష్టం
సకాలంలో క్రాప్​లోన్లు ఇవ్వకపోవడం వల్ల రైతులకు పంట బీమా వర్తించడం లేదు. జులై 31 వరకు వానాకాలం పంటలకు, ఆగస్టు 31 వరికి, డిసెంబర్ 31కి యాసంగి పంటకు బీమా ప్రీమియం చెల్లింపు కటాఫ్ డేట్ గా ఉంది. ఆ తేదీలోపు రైతులకు లోన్లు ఇచ్చినప్పుడు మాత్రమే రుణాల నుంచి కొంత ప్రీమియంను తీసుకొని రైతులకు ఇస్తారు. అలా వసూలు చేసిన ప్రీమియంను బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాలి. కానీ కటాఫ్ డేట్​కు ముందు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం వల్ల పంట బీమాకు ప్రీమియం చెల్లింపు జరగడం లేదు. కొన్ని బ్యాంకులు కటాఫ్ డేట్ తరువాత ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేసి, బ్యాంకు ఖాతాలో వేసుకొని రైతులను మోసగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం వల్ల రైతులకు పంట బీమా వర్తించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని ఫసల్ బీమా నుంచి విరమించుకుంది. తిరిగి ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు పంట రుణాలు అందక, పంట బీమా వర్తించక రెండు విధాలుగా నష్టపోతున్నారు. అందువల్లే రాష్ట్రంలో ఎన్ని వ్యవసాయ పథకాలు అమలు జరిగినా అన్నదాతల ఆత్మహత్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 
                                                                                  - మూడ్ శోభన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం