ఫేక్ ఐడీలతో కస్టమర్ల బంగారంపై లోన్.. మణప్పురం బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్

ఫేక్ ఐడీలతో కస్టమర్ల బంగారంపై లోన్.. మణప్పురం బ్రాంచ్ మేనేజర్ ఫ్రాడ్
  • ఫేక్​ఐడీలతో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారంపైనే మళ్లీ లోన్
  • కంపెనీ నుంచి 1.24 కోట్లు కాజేత
  • బ్రాంచ్ మేనేజర్ విశాల్ అరెస్ట్
  • కస్టమర్ల బంగారం ఎక్కడికి పోలేదన్న ఎస్పీ  

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ లో సంచలనం సృష్టించిన మణప్పురం గోల్డ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఎస్పీ నారాయణరెడ్డి శుక్రవారం వెల్లడించారు. గత నెల 16న వికారాబాద్ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ లో పై అధికారులు ఆడిట్ చేయగా, ఒక నగల ప్యాకెట్ తక్కువగా వచ్చింది. దీంతో అనుమానం వచ్చి  స్ట్రాంగ్ రూమ్ తెరిచి చూడగా, మొత్తం 63 బంగారం నగల ప్యాకెట్లు కనిపించలేదు. 

దీంతో గత నెల19న బ్రాంచ్ మేనేజర్ విశాల్, జూనియర్ అసిస్టెంట్లు శివప్రసాద్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ఆడిటర్ రాజకుమార్​పై రీజినల్ మేనేజర్ రవీంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీటి బరువు 2,944.2 గ్రాములు ఉండగా, విలువ రూ.2.10 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ సీఐ బలవంతయ్య ఆధ్వర్యంలో  ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఏ1 విశాల్ ను తన స్వగ్రామం నారాయణపూర్​లో అరెస్ట్ చేశారు. 

డబ్బు కొట్టేశాడిలా..

మణప్పురం కంపెనీలో గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఆధార్, పాన్ కార్డు, మొబైల్ నంబర్, బంగారం తీసుకొని బ్రాంచ్ కు వెళ్లాలి. ఆన్​లైన్​లో కస్టమర్ వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ఐడీ క్రియేట్ చేస్తారు. దీని ఆధారంగా గ్రాముకు రూ.5 వేల చొప్పున లోన్ ఇస్తారు. ఒకసారి ఐడీ నమోదు చేస్తే, కస్టమర్ ఏ డాక్యుమెంట్ లేకుండానే మళ్లీ మళ్లీ లోన్ తీసుకోవచ్చు. కంపెనీ బిజినెస్ కోసం ప్రతిరోజూ తప్పకుండా ఒక లోనైనా చేయాలి. 

ఈ లొసుగును వాడుకొని, కిందిస్థాయి సిబ్బందిని నిజాయితీపరుడిగా నమ్మించి, తనకు తెలిసిన 20 మందిపై బ్రాంచ్ మేనేజర్ విశాల్ 63 ఫేక్ ఐడీలు నమోదు చేశాడు. అప్పటికే బ్రాంచ్​లో ఉన్న బంగారాన్ని ఎవరికీ తెలియకుండా తీసి, మళ్లీ వాటిపైనే ఈ ఐడీలతో లోన్ ​తీశాడు. ఇలా మొత్తంగా రూ.1.24 కోట్లను బ్రాంచ్ నుంచి కాజేశాడు. ఈ డబ్బుల్లో  కొంత తన అవసరాలకు, మిగిలినవి బెట్టింగ్​లో పెట్టాడు. ఇవేకాకుండా కస్టమర్లు తాకట్టు పెట్టిన 5 బంగారం ప్యాకెట్లను కొట్టేశాడు. 

పై అధికారులు ఆడిట్​కు వచ్చే సమయంలో ఏఏ ఐడీలలో ఆడిట్ జరుగుతుందో నిందితుడు ముందే తెలుసుకొని, ఆడిటర్ రాజ్​కుమార్, జూనియర్ అసిస్టెంట్లు శివప్రసాద్ రెడ్డి, గోవర్దన్ రెడ్డితో కలిసి మేనేజ్ చేసేవాడు. నిందితుడి నుంచి 83 గ్రాముల బంగారం, రూ.10 లక్షల డబ్బును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతడికి సహకరించిన వారిపైన దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కస్టమర్ల బంగారం ఎక్కడికి పోలేదని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.