కరీంనగర్ క్రైం, వెలుగు : లోన్ యాప్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ కోతిరాంపూర్‌లోని పోచమ్మవాడకు చెందిన సతీశ్‌రెడ్డి (43) కార్లు కొనుగోలు చేసే వ్యక్తులకు వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తుంటాడు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఓ షట్టర్ కిరాయికి తీసుకొని సతీశ్ అసోసియేట్స్ పేరుతో సంస్థను ప్రారంభించాడు. కార్ లోన్ తీసుకున్న వ్యక్తులు ఈఎంఐలు సరిగ్గా కట్టకపోవడంతో బ్యాంకర్లు సతీశ్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. అలాగే అతడు తన అవసరాల కోసం కొన్ని లోన్ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నాడు.
ఈ డబ్బులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు పదే పదే ఫోన్లు చేసి వేధించసాగారు. తనకు రావాల్సిన డబ్బులు రాకపోవడం, లోన్ యాప్ వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపానికి గురైన సతీశ్‌రెడ్డి గురువారం ఉదయం జ్యోతినగర్‌లోని తన ఆఫీస్‌లో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన సిబ్బంది హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చనిపోయాడని చెప్పినా ఆగని ఫోన్ కాల్స్
సతీశ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా లోన్ యాప్ నుంచి అనేక మార్లు ఫోన్‌కాల్స్ వచ్చాయి. సతీశ్‌రెడ్డి చనిపోయాడని చెప్పినా వినకుండా పదేపదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.