
- ఆన్లైన్ యాప్‌లో అప్పు తీసుకుని కట్టని కార్తీక్
- కరీంనగర్ జిల్లాలో ఘటన
- టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తున్న మృతుడు
జమ్మికుంట: ఆన్లైన్ యాప్స్‌లో అప్పు తీసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పరిస్థితులు అనుకూలించక కట్టకపోవడంతో రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి పరువు తీస్తామని బెదిరించారు. దీంతో భయపడిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పోల్సాని కార్తీక్(26) హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.
ఆదివారం కార్తీక్ తల్లిదండ్రులు తిరుపతి వెళ్తూ రమ్మని అడగ్గా తనకు వీలుకాదని ఇంటి దగ్గరే ఉండిపోయాడు. వారు తిరుపతి చేరుకున్నాక తనకు అర్జంటుగా రూ.50వేలు కావాలని తండ్రికి ఫోన్ చేసి అడిగాడు. తొందర ఏముందని ఇంటికి వచ్చాక ఇస్తానని బదులిచ్చాడు. బుధవారం కార్తీక్ పేరెంట్స్ ఇంటికి వచ్చి చూసేసరికి పురుగుల మందు తాగి చనిపోయి కనిపించాడు. కార్తీక్ ఫోన్ చెక్ చేయగా ‘నేను ఆన్లైన్ యాప్స్‌లో అప్పు చేశాను. ఆ డబ్బులు కట్టాలని రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు’ అని సెల్ఫ్ మెసేజ్ ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.
నిజామాబాద్ క్రైమ్ వెలుగు : రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి పరువు తీయడంతో నిజామాబాద్‌లోని గాజులపేట్ ప్రాంతానికి చెందిన నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో టౌన్ ఎస్సై రామ్ కథనం ప్రకారం.. నారాయణ షేర్ మార్కెట్లో పని చేస్తూ డబ్బులు అవసరమైనప్పుడు తన క్రెడిట్ కార్డు నుంచి తీసుకునేవాడు. అయితే, డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ కార్డు రికవరీ టీం నారాయణ ఇంటికి వచ్చి గొడవ చేసింది. అందరి ముందు పరువు తీయడంతో మనస్తాపంతో ఇంట్లోని ఫ్యానుకు ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రామ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తుపరుస్తున్నారు.