లోన్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టే నాథుడే లేడా...?

  • అడిగేవాడు లేడని దారుణాలకు తెగబడుతున్న లోన్ యాప్ డొల్ల కంపెనీలు
  • ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న డొల్ల కంపెనీల రుణ యాప్లు
  • దేశ వ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్ డొల్ల కంపెనీలు
  • దేశంలో లోన్ యాప్ డొల్ల కంపెనీలు 30వేలు పైనే
  • తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ డొల్ల కంపెనీలు 4వేలు పైనే

అప్పు ఇచ్చిన వాడు తన అప్పు చెల్లించాలని ఏదో రకంగా నయానో భయానో  బెదిరించి తమ అప్పులు వసూలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వచ్చిన ‘రుణ యాప్‌‌’ వారు చేసే దౌర్జన్యాల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలైతే తమ పరువు మర్యాదలు పోగొట్టుకుంటున్నారు. తెల్లవారితే ఇవే వార్తలు దేశమంతటా మారుమోగిపోతున్నాయి. దీనకంతటికీ కారణం మనదేశంలోని నిర్లక్షమైన  ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీరే.

కొన్ని కంపెనీలు స్థాపనకు అనుమతులు, రుణాలు, మౌలిక వసతులు పొందుతున్నప్పటికీ, ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండా బోగస్ (డొల్ల) కంపెనీలు కోకొల్లలుగా పుట్టుకు రావడమే. మన ప్రభుత్వం, అధికారులు, సంబంధిత శాఖ ఉదాసీనత వీడి రికార్డులకే పరిమితమై ఎలాంటి కార్యకలాపాలు సాగించని వాటిని గుర్తించి తొలగింపుకు పూనుకుంది. ఇలాంటి కంపెనీలు దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవి 4వేల కంపెనీలు ఉన్నట్లు తేలింది. వీటిలో ప్రధానంగా కార్యకలాపాలు సాగించనివి, రికార్డులు నిర్వహించని, వార్షిక రిటర్న్‌‌లు దాఖలా చేయని పలు కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా కార్పొరేట్ వ్యవహారాల పరిధిలోని వివిధ ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీ కార్యాలయాల్లో 15 లక్షల పైగా కంపెనీలు నమోదై ఉన్నాయి. గత ఏడాది కాలంలోనే 2.5 లక్షల కంపెనీలు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నాయి. ఇలా కొత్తగా ఏర్పాటు అయిన కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను నిర్దిష్ట సమయంలో ప్రారంభించి ఆ సమాచారాన్ని ఆర్వోసీలకు తెల్పాలి. అంతేకాకుండా సమయానుకూలంగా రికార్డులు పాటించాలి, ఆ నిబంధనలు అన్ని కంపెనీలకూ వర్తిస్తాయి. లాభనష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, వార్షిక నివేదిక తదితర సమాచారంతో కూడిన రికార్డులు సకాలంలో దాఖలా చేయకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది.

నోటీసులు ఇచ్చినా స్పందించని కంపెనీల పేర్లను తొలగిస్తారు. మరికొన్ని కేవలం కాగితాలకే పరిమితమై బోగస్ (డొల్ల)కంపెనీలు కూడా ఎన్నో ఉన్నాయి. కార్పొరేట్ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 7వేల కంపెనీలు లిక్విటేషన్ ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. సుమారు తొమ్మిది లక్షల కంపెనీలు వివిధ కారణాల వల్ల మూతపడ్డాయి. ఇదే కాకుండా కార్యకలాపాలు సాగించని రికార్డులు చూపని కంపెనీలు వేల సంఖ్యలో ఉంటున్నాయని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం అక్రమ కంపెనీలపై ఉక్కు పాదం మోపాలని సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. ప్రభుత్వాలను, ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకొని ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసే ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సి ఉంది.

ఉదాసీనత వహిస్తున్న ప్రభుత్వం

బడా కార్పొరేట్ బోగస్ కంపెనీల అక్రమ దందాలు కొనసాగిస్తున్న వాటికి ప్రజాధనాన్ని, మౌలిక వసతులను పందేరంలా పంచి పెడుతున్న ప్రభుత్వం అక్రమాలను ఉదాసీనంగా చూస్తోంది. వారు స్థానికులకు ఉపాధి, ఉద్యోగం చూపుతామన్న హామీ కూడా నెరవేరడం లేదు. ఇలాంటి బోగస్ కంపెనీల ఆగడాలను అరికట్టాలి. రుణ యాప్‌‌ల దారుణాలు ఎన్నని చెప్పగలం?  సామాన్య, మధ్యతరగతి వారు అప్పు కోసం రుణ యాప్‌‌ల ఊబిలో పడి ఆత్మహత్యల పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అక్రమ రుణ యాప్ సంస్థల ఏజెంట్లు చేసే దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

మహిళా రుణగ్రస్తులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. రక్తాన్ని పీల్చే జలగల్లా వ్యవహరిస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు. చిరు ఉద్యోగులు, వీధి వ్యాపారులు, పేద, మధ్యతరగతి వారు, చదువుకున్నవారు సైతం రుణ యాపుల బారినపడి విలవిలలాడుతున్నారు. ఆర్​బీఐ వద్ద నమోదైన రుణ యాప్‌‌లు మాత్రమే యాప్ స్టోర్ లలో ఉండేలా చూసి, అనధికారికంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుణ యాప్‌‌లను యాప్ స్టోర్ లో నుంచి తొలగించేందుకు ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజలకు పరువు నష్టం, ప్రాణ నష్టం. వడ్డీలు చెల్లించలేక ఉన్న కొద్దిపాటి స్థిరాస్తులు కోల్పోయాక ఆర్థిక శాఖ చర్యలకు దిగింది. 

యాప్‌‌ల కట్టడికి ప్రయత్నాలు..

మన తెలంగాణలో 2020లో ఆన్ లైన్ రుణ యాప్‌‌ల కేసులు 61 నమోదు కాగా 2022 వచ్చేసరికి అవి ఏకంగా 3342 కు పెరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ అనధికార రుణ యాప్‌‌ల కార్యకలాపాలను సత్వరం కట్టడి చేయడానికి ఐదు అంశాలతో కూడిన కార్యాచరణ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. అవి 1. చట్టబద్ధమైన అన్ని యాప్‌‌లపై ఆర్‌‌‌‌బీఐ ఒక శ్వేత పత్రం తయారు చేస్తుంది. ఆ జాబితాలోని యాప్‌‌లు మాత్రమే యాప్ స్టోర్లలో ఉండేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ధృవీకరించాలి.

2. మనీ లాండరింగ్ ఉపయోగిస్తున్న అద్దె ఖాతాలను ఆర్‌‌‌‌బీఐ పర్యవేక్షించాలి. నిద్రాణ స్థితిలో ఉన్న ఎస్‌‌బీఎఫ్‌‌ల కార్యకలాపాలు సమీక్షించి అవి దుర్వినియోగం కాకుండా వాటి లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలి. 3. పేమెంట్ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయడానికి ఆర్‌‌‌‌బీఐ చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత నమోదు కాని అగ్రిగేటర్లు ఎవరిని ఆర్థిక కార్యకలాపాల్లోకి అనుమతించకుండా చూడాలి. 4. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సెల్ కంపెనీలను గుర్తించి వెంటనే రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి. 5.వినియోగదారులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు ఇతర భాగస్వాములకు సైబర్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి. 

ఆలస్యం చేస్తే అంతే..

కేంద్రఆర్థిక వ్యవహారా ల విభాగం, తదితర విభాగాలతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సంయుక్తంగా పై నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో రాజకీయ ఒత్తిళ్లకు భయపడకుండా కార్యరూపం దాల్చాల్సి ఉంది. మన దేశంలో ఒకవైపు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలోని కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను సమాచారాన్ని అందించకుండా ఉన్నాయి. అంతేకాకుండా కేవలం కాగితాలకి పరిమితమై బోగస్ (డొల్ల )కంపెనీలు ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నాయి.

ఇలాంటి అక్రమ దందాలను కఠిన చట్టాలతో ఉక్కు పాదం మోపి కట్టడి చేయాల్సి ఉంది. మరోవైపు ఆర్‌‌‌‌బీఐ వద్ద నమోదు కాని రుణ యాప్‌‌లు దారుణాలతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అప్పులతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఈ దారుణానికి రుణ యాప్‌‌ల నిర్వాహకులు బాధ్యులు కారా! వీటి తీరు అమానవీయంగా ఉంది. వీటి ఆర్థిక దోపిడిని అరికట్టకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉదాసీనంగా వ్యవహరించడం మంచిది కాదు. వెంటనే ఈ అక్రమ దందాలు కట్టడి చేస్తూ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల జీవితాలకు భరోసా కల్పించాల్సి ఉంది.  - మేకిరి దామోదర్,  సోషల్ అనలిస్ట్.