యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం అందించే సబ్సిడీలతో సూక్ష్మ, ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందడంతో పాటు, జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. నూతన ఆలోచనలతో ఆహార ఉత్పత్తులకు సంబంధించి యూనిట్లను నెలకొల్పాలని సూచించారు. సూక్ష్మతరహా పరిశ్రమలకు సంబంధించి తయారీ రంగానికి 25 నుంచి 35 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. బ్యాంకుల సహకారంతో మరింత వృద్ధి చెందవచ్చన్నారు. అలాగే డిసెంబర్ 8 వరకు నూతన ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదుపై తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. సదస్సులో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీలక్ష్మి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ రమణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య, డీపీఆర్‌వో పి.వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి యూనిట్లకు లోన్ ఫెసిలిటీ
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు బ్యాంకులు లోన్ ఫెసిలిటీతో పాటు, సబ్సిడీ సౌకర్యం కల్పిస్తున్నట్లు నల్గొండ అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. స్వయం ఉపాధి పథకాలపై మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. మా ర్కెట్ డిమాండ్, అవసరాలకు తగ్గట్లుగా యూనిట్లు నెలకొల్పి ఉపాధి పొందాలని సూచించారు. అనంతరం అప్లై చేసుకునే విధానం, బ్యాంక్ లోన్ ఎలా పొందాలి, మార్కెటింగ్ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. అలాగే పీఎంఈజీపీ కింద నలుగురికి మంజూరైన రూ. 30 లక్షల లోన్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం జీఎం కోటేశ్వరరావు, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏడీ.ప్రసాద్‌శర్మ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మంగ్తా నాయక్, ఎల్‌జీఎం శ్రామిక్, పరిశ్రమల శాఖ ఏడీ గణేశ్ పాల్గొన్నారు.