రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం కీలక సూచన

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ మొత్తం మూడు  దశల్లో రుణమాఫీ ప్రాసెస్ కంప్లీట్ చేయగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. ఈ క్రమంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన చేశారు. 

ఇవాళ (సెప్టెంబర్ 23) కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మంత్రి పొన్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ కాని రైతులెవరూ ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని.. అర్హులందరికీ ప్రభుత్వం పంట రుణం మాఫీ చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతులు గ్రామాల్లో ఏఈఓలకు సమాచారం ఇవ్వాలని కీలక సూచన చేశారు. 

ALSO READ | దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై స్టే..

ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని హామీ ఇచ్చిన పొన్నం..  ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం, మరమత్తులు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.  ఇంకా అవసరం ఉంటే రెండవ విడతలో మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్డు సౌకర్యం లేని గ్రామం ఉండకూడదన్నదే తమ లక్ష్యమని అన్నారు.