యాదాద్రిలో తేలని రుణమాఫీ లెక్క

  •     గతంలో రుణాలు తీసుకున్న రైతులు 1.18 లక్షలు
  •     43 వేల మందికి మాఫీ
  •     పెండింగ్​లో 74,282 మంది రైతులు 
  •     గత అక్టోబర్​నుంచి ఎందరు తీసుకున్నారో ఇంకా తేలని లెక్క

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో రుణమాఫీ లెక్కలు ఇంకా పూర్తిగా తేలలేదు. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడానికి సర్కారు సమాయత్తమవుతుంటే.. ఆఫీసర్లు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. 2018లో రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య,  వీరిలో గత ప్రభుత్వం ఎంతమందికి మాఫీ చేసిందో కొంతమేర లెక్కలున్నాయి. గతేడాది అక్టోబర్​నుంచి రుణాలు తీసుకున్న రైతుల లెక్కలు మాత్రం అందుబాటులో లేవని ఆఫీసర్లు చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న స్పీడ్​ఆఫీసర్లలో కన్పించడం లేదు. 

బ్యాంకుల నుంచి రుణాలు పొందిన డేటా తెప్పించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. సమాచారం కోసం ప్రయత్నిస్తే అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​మీద లీడ్​బ్యాంక్ నెపం వేస్తోంది. అయితే అగ్రికల్చర్​ఆఫీసర్లు మాత్రం రుణమాఫీ డేటా పూర్తిగా లీడ్​ బ్యాంక్​ వద్దనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.  రైతులకు సంబంధించిన రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని 2018 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 2020 మేలో రూ.25 వేలలోపు రుణాలు, 2021 ఆగస్టులో రూ.50 వేలలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా చేయలేకపోయింది. 

గతేడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2023 ఆగస్టులో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని గత సర్కారు ప్రకటించింది. అయితే, మాఫీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. అనంతరం ఎన్నికలు షెడ్యూల్​కారణంగా కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మాఫీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

బ్యాంకర్ల నుంచి లెక్కలు లేటు..?

గత అక్టోబర్​నుంచి బ్యాంకులు నుంచి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఎంతమంది రైతులు ఎంత మొత్తంలో లోన్లు తీసుకున్నారో తెలుసుకోవడానికి లీడ్​ బ్యాంక్​ఆఫీసర్లను సంప్రదిస్తే సమాధానం చెప్పడం లేదు. జిల్లాలోని వివిధ బ్యాంకుల నుంచి రుణాలకు సంబంధించిన డిటైల్స్​ఇంకా తమకు రాలేదంటున్నారు. పైగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని లీడ్​బ్యాంక్​ఆఫీసర్లు అంటున్నారు. కాగా, రుణమాఫీ డిటైల్స్​కోసం అగ్రికల్చర్​ఆఫీసర్లను సంపద్రించగా వివరాలు లీడ్​బ్యాంక్​వద్దే ఉంటాయని చెబుతున్నారు.  

యాదాద్రిలో 74,282 మంది రైతులు..

అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2018 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్​నాటికి యాదాద్రి జిల్లాలో 1,18,015 మంది రైతులు రూ.629.66 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. గత ప్రభుత్వం రూ.25 వేలు, రూ.50 వేలతోపాటు రూ. లక్ష రుణాలు తీసుకున్న కొందరు రైతులకు సెప్టెంబర్ 2023 నాటికి 43,733 మందికి పలు దఫాలుగా రూ.237.95 కోట్లను మాఫీ చేసింది. ఇంకా మిగిలిన 74,282 మంది రైతులకు సంబంధించిన 391.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే వీటికి వడ్డీ అదనంగా లెక్కించాల్సి ఉంటుంది.